Tax Rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! మార్చి 31 డెడ్‌లైన్ లోపు చేయాల్సిన పనులు ఇవే!
ఆర్థిక సంవత్సరం (FY 2025-26) ముగింపు సమయం దగ్గరపడుతోంది. ప్రతి ఏటా మార్చి 31వ తేదీ అనేది పన్ను చెల్లింపుదారులకు, జీతాలు తీసుకునే ఉద్యోగులకు అత్యంత కీలకమైన రోజు. ఈ గడువు ముగిసేలోపు మీరు చేసే కొన్ని ఆర్థిక నిర్ణయాలు పన్ను ఆదా చేయడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ముఖ్యంగా కొత్త ట్యాక్స్ రూల్స్ (Tax rules) ప్రకారం మీ పెట్టుబడులను సరిచూసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం.

అడ్వాన్స్ టాక్స్ గడువును మర్చిపోకండి
పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన మొదటి ముఖ్యమైన తేదీ మార్చి 15. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ టాక్స్ చివరి వాయిదా చెల్లించడానికి ఇదే ఆఖరి రోజు. ఎవరికైతే అంచనా వేసిన పన్ను బాధ్యత రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటుందో, వారు తప్పనిసరిగా ఈ గడువులోపు పన్ను చెల్లించాలి. లేనిపక్షంలో పెండింగ్‌లో ఉన్న మొత్తంపై వడ్డీ భారం పడే అవకాశం ఉంది. అయితే, వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేని 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు అడ్వాన్స్ టాక్స్ నుండి మినహాయింపు ఉంటుంది.
పన్ను ఆదా పెట్టుబడులు (Tax Saving Investments)
మీరు పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకున్నట్లయితే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. దీని కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి ఖాతా (SSA), లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి సాధనాల్లో మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టాలి. ఈ తేదీ దాటిన తర్వాత చేసే పెట్టుబడులు తదుపరి ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయి. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారు పెట్టుబడుల ద్వారా మినహాయింపులు పొందలేరని గుర్తుంచుకోవాలి.
ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ సమర్పించడం
ఉద్యోగులు తాము చేసిన పెట్టుబడుల ఆధారాలను (Supporting Documents) తమ కార్యాలయాల్లోని హెచ్ఆర్ లేదా పేరోల్ విభాగాలకు సకాలంలో సమర్పించాలి. సరైన సమయంలో డాక్యుమెంట్లు ఇవ్వకపోతే, మీ జీతం నుండి ఎక్కువ మొత్తంలో టీడీఎస్ (TDS) కట్ అయ్యే ప్రమాదం ఉంది. హోమ్ లోన్ ఉన్నవారు బ్యాంకు నుంచి వడ్డీ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఆరోగ్య బీమా, ఇతర ప్రయోజనాలు
సెక్షన్ 80D కింద మీరు మీ కోసం , మీ కుటుంబం కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సాధారణ వ్యక్తులకు రూ. 25,000 వరకు, సీనియర్ సిటిజన్లకు రూ. 50,000 వరకు ఈ మినహాయింపు ఉంటుంది. అలాగే, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు 'టాక్స్ గెయిన్ హార్వెస్టింగ్' (Tax Gain Harvesting) పద్ధతిని ఉపయోగించి సెక్షన్ 112A కింద రూ. 1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపును ఉపయోగించుకోవచ్చు.
చివరగా గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ముందే మీ పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది. ఇది మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, తప్పుడు పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని కాపాడుతుంది.


Click it and Unblock the Notifications