Gold News: మనలో చాలా మంది పర్సనల్ లోన్ కంటే బంగారంపై రుణాన్ని పొందేందుకు ఇష్టపడుతుంటాం. వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో పాటు.. సిబిల్ స్కోర్ కూడా దీనికి ప్రామాణికం కాకపోవటం రుణాన్ని సులభంగా పొందేలా చేస్తోంది. అయితే ప్రస్తుతం బంగారంపై రుణాలు తీసుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం.
ఇటీవల ఆర్బీఐ దేశంలోని గోల్డ్ లోన్ వ్యాపారంలో ఉన్న ఐఐఎఫ్ఎల్ తీవ్రమైన చర్యలు తీసుకుంది. దీని తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ బంగారు రుణాల విషయంలో జరుగుతున్న అవకతవకలపై అప్రమత్తంగా ఉండాలని దేశంలోని బ్యాంకులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించకపోవటంతో తాజా కఠిన చర్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 67 శాతం గోల్డ్ లోన్ ఖాతాల్లో లోన్ టు వాల్యూ రేషియోలో అవకతవకలు ఉన్నాయని ఆర్‌బీఐ దర్యాప్తులో వెల్లడైంది. రుణం ఇచ్చే సమయంలో బంగారం ధర నిర్ణయించడంలో తప్పులు జరిగినట్లు గుర్తించింది.

దేశంలో గోల్డ్ లోన్స్ మెుత్తం విలువ సుమారు రూ.6 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో బ్యాంకులు గరిష్ఠంగా 80 శాతం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ లోన్ విషయంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం మెుత్తం తనఖా పెట్టిన పసిడి విలువలో 75 శాతానికి మాత్రమే రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే రిజర్వు బ్యాంక్ విచారణలో సదరు సంస్థలు బంగారం ధరను తక్కువగా అంచనా వేస్తున్నట్లు, రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన సమయంలో వేలం వేసి లాభాన్ని ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు రిజర్వు బ్యాంక్ ఇటీవల రంగంలోకి దిగింది.
బ్యాంకులు, NBFCల బంగారు రుణాల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులలో భారీ వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ బ్యాంకులు 8.65 నుంచి 11 శాతం వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తుండగా, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏడాదికి 17 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. NBFC కంపెనీల రుణాలపై వడ్డీ రేట్లు 36 శాతంగా వసూలు చేస్తున్నాయి. ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయంలో.. స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ రుణ మొత్తంపై 0.5% లేదా గరిష్టంగా రూ. 5000 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. అయితే NBFCలు రుణ మెుత్తంలో 1% కంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి.
సాధారణంగా బంగారంపై తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు మూడేళ్ల పాటు గడువు ఉంటుంది. ఈ క్రమంలో సమయానికి వడ్డీ చెల్లించి అసలు అలాగే కొనసాగించొచ్చు. లేదా రుణాన్ని ఈఎంఐల రూపంలో కూడా చెల్లించుకోవచ్చు. అయితే ఇతరుల మాటలు నమ్మి రుణాన్ని చెల్లించకుండా ఉంచినట్లయితే బంగారం వేలం వేయబడి భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు బంగారం విలువ, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం మంచిది.


Click it and Unblock the Notifications