Pakistan Crisis: దాయాది పాకిస్థాన్ ఐఎంఎఫ్ సహాయం కోసం పడరాని పాట్లు పడుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఎన్నడూ లేని విధంగా ధరల భారాన్ని మోస్తున్నారు. కరెంటు, ఇంధనం నుంచి ఆహారపదార్థాల వరకు అన్నింటి ద్రవ్యోల్బణం భారీగా పెరగుతూ పోతోంది.
ఈ పరిస్థితుల్లో అప్పు పొందేందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతులకు పాక్ తలొగ్గింది. ఈ క్రమంలో ఇప్పటికే అంగీకరించిన రుణ సదుపాయం కింద నిధులను విడుదల చేయడానికి ప్రపంచ ఆర్థిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అన్ని షరతులను నెరవేర్చినట్లు నగదు కొరత ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వ వాదనను IMF తిరస్కరించింది. షరతులను నెరవేర్చితే 6 బిలియన్ డాలర్లను అందించటానికి ఒప్పందంపై 2019లో సంతకం చేసిన సంగతి తెలిసిందే.

రుణం పొందాలంటే పాక్ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాలని ఐఎంఎఫ్ పట్టుపట్టింది. అయితే పాక్ ప్రధాని, ఆర్థిక మంత్రి మాత్రం తాము ఒప్పందానికి అవసరమైన అన్ని షరతులను నెరవేర్చామని, రుణాన్ని వాయిదా వేయటానికి ఎలాంటి కారణాలు లేవంటూ పదేపదే చెబుతున్నారు. అయితే పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటనను ఐఎంఎఫ్ మాత్రం నిరాకరిస్తూ తాజాగా ప్రకటన వెలువరించింది.
ఈ ఏడాది జూన్ నాటికి ఫైనాన్సింగ్ అంతరాన్ని పూడ్చేందుకు పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్లు అవసరమని పాక్ ఆర్థిక మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3 బిలియన్ డాలర్లు అందజేస్తామని ఇప్పటికే దాయాదికి హామీ ఇచ్చాయి. అయితే మిగిలిన రుణాన్ని పొందటానికి ఎలాంటి హామీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో రుణాలు, రుణ వడ్డీలకు మాత్రమే పాక్ ఏకంగా 4 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. మరోపక్క విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోవటం పాకిస్థాన్ ను పతనం అంచుకు నెడుతోంది.


Click it and Unblock the Notifications