India imf: మాంద్యం భయాలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్న వేళ.. అతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) మంగళవారం విడుదల చేసిన నివేదిక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. 2023 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రపంచ వృద్ధి రేటు 2.9 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. 2022లో 3.4 శాతం ఉండగా.. 2023లో 2.9 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ఆపై 2024లో 3.1 శాతంతో కొంత మెరుగుదల కనిపిస్తుందని అభిప్రాయపడింది. కానీ ఇండియా ఎకానమీపై మాత్రం సానుకూల దృక్పథం కనపరచింది.

పడినా తిరిగి లేస్తుంది:
భారత ఆర్థిక వ్యవస్థలోనూ కొంత మందగమనం ఉంటుందని IMF పేర్కొంది. మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని వెల్లడించింది. గత అక్టోబర్ లో ప్రకటించిన తమ అంచనాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. కానీ 2023 ఆర్థిక ఏడాదికిగాను కొంతమేరకు క్షీణత ఏర్పడి.. వృద్ధి రేటు 6.8 నుంచి 6.1 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు IMF పరిశోధనా విభాగం డైరెక్టర్ పియర్ ఒలివియర్ గౌరించాస్ వివరించారు. 2024లో తిరిగి 6.8 శాతానికి చేరుకుంటుందన్నారు.

40 ఏళ్లలో మొదటిసారి చైనాకు ఎదురుదెబ్బ:
ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటులో పెద్ద తేడా ఉండబోదని IMF అభిప్రాయపడింది. 2023లో 5.3, 2024లో 5.2 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. 2022 సంవత్సరాంతంలో చైనా తన ఆర్థిక కార్యకలాపాలు నిలిపివేయడంతో.. గత 40 ఏళ్లలో మొదటిసారి ఆ దేశ వృద్ధి ప్రపంచ సగటు కంటే తక్కువగా నమోదైందని పేర్కొంది. 2023లో 5.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినా.. 2024లో తిరిగి 4.5 శాతానికే పరిమితమవుతుందని వెల్లడించింది.

అమెరికా, ఐరోపా దిగదుడుపే..
ఆర్థికాభివృద్ధిలో భారత్ గొప్పగా ప్రకాశిస్తోందని ఓ బ్లాగ్ పోస్ట్ లో గౌరించాస్ పేర్కొన్నారు. పొరుగు దేశం చైనాతో కలిపి చూస్తే.. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా 50 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో US, యూరప్ దేశాల వాటాను కలిపినా కేవలం పదో వంతు మాత్రమేనని అంచనా వేశారు. USలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, EUలో ఇంధన సంక్షోభం మరింత సవాలుగా మారనుండటమే ఇందుకు కారణమన్నారు. మొత్తంగా.. అభివృద్ధి చెందిన 10 ఆర్థిక వ్యవస్థల్లో 9 మందగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications