Rising Poverty: కరోనా తరువాత ద్రవ్యోల్బణం దశాబ్ధాల గరిష్ఠాలకు చేరుకోవటంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పేదరికం కబంధ హస్తాల్లో చిక్కుకోనున్నారని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు క్లిష్ట పరిస్థితులను సృష్టించింది. దీనికి ద్రవ్యోల్బణం తోడవటంతో ఆర్థిక మాంద్యం ముప్పు ప్రపంచ దేశాలను కొత్త ఆందోళనలకు గురిచేస్తోంది.

2023లో మరిన్ని కష్టాలు..
ఫేసింగ్ ఎ డార్కనింగ్ ఎకనామిక్ ఔట్‌లుక్: హౌ ది జి20 కెన్ రెస్పాండ్ అనే బ్లాగ్ పోస్ట్‌లో క్రిస్టాలినా ఈ హెచ్చరిక చేశారు. వచ్చే ఏడాది సవాళ్లు మరింత తీవ్రంగా ఉంటాయని ఆమె అన్నారు. ప్రస్తుతానికి అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందే ఆశను ప్రపంచం చూడడం లేదని జార్జివా పోస్ట్‌లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితులను తీవ్రతరం చేసిందని ఆమె అన్నారు.

ద్రవ్యోల్బణం నుంచి NO-రిలీఫ్:
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు. తూర్పు ఐరోపాలో జరుగుతున్న పోరాటాలు దానిని మరింత పెంచాయి. IMF ఏప్రిల్ 2022లో విడుదల చేసిన ఎకనామిక్ అవుట్‌లుక్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం చాలాకాలం ప్రపంచాన్ని పీడిస్తుందని పేర్కొంది. IMF అంచనాల ప్రకారం.. 2022 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం రేటు 5.7 శాతంగా ఉండవచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రేటు 8.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

భారత్ పరిస్థితి.. 41 ఏళ్ల గరిష్ఠానికి..
ప్రస్తుతం భారత్ సహా అమెరికా అమెరికా వంటి అగ్రదేశాలు రికార్డు ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జూన్ నెలలో దేశంలోని టోకు ద్రవ్యోల్బణం రేటు 15.18 శాతంగా ఉంది. మే నెలలో ఇంతకంటే ఎక్కువగానే ఉంది. జూన్ 2021లో టోకు ద్రవ్యోల్బణం రేటు 12.07 శాతం వద్ద ఉంది. ఇది 15 శాతం దాటడం వరుసగా మూడో నెల కావటం కొంత ఆందోళన కలిగిస్తోంది. 1998 తర్వాత టోకు ద్రవ్యోల్బణం 15 శాతం దాటడం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నుంచి జూన్ లో 9.1 శాతానికి పెరిగింది. గత 41 ఏళ్లలో ఇది అత్యధికం.

ఆందోళనకరంగా చైనా పరిస్థితి..
ప్రపంచానికి కరోనా మహమ్మారిని అంటించిన చైనా పరిస్థితి సైతం దారుణంగా మారుతోంది. తాజాగా మరో సంక్షోభాన్ని చైనా దాచిపెడుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలకు దాదాపు 80కి పైగా నగరాల్లోని ప్రజలు చెల్లింపులు చేయటం లేదు. ఇది 2008లో అమెరికాలో జరిగిన సబ్ ప్రైమ్ లెండింగ్ బబుల్ కు సమానమైనది. ఇది మళ్లీ జరిగితే.. అప్పటిలాగే ప్రపంచం మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరో పక్క చైనాలో ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా, పరిస్థితి ప్రస్తుత అంచనా కంటే దారుణంగా ఉండవచ్చని జార్జివా తెలిపారు.


Click it and Unblock the Notifications