Bengaluru Hot Summer: మరి కొద్ది రోజుల్లో చలికాలం ముగిసిపోనుంది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో నగరాల్లోని ప్రజలకు వేసవి కష్టాలు ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఇదే క్రమంలో భారత వాతావరణ సంస్థ కూడా ప్రజలకు రానున్న రోజుల్లో పరిస్థితులపై ఇప్పటికే తన రిపోర్టు ద్వారా హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఇదే క్రమంలో భారతీయ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొంది ఐటీ సేవల రంగానికి కేంద్ర బిందువుగా మారిన బెంగళూరులో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా దేశ రాజధాని దిల్లీ కంటే ఉష్ణోగ్రతలు ఏకంగా 9 శాతం అధికంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 17న బెంగళూరులో ఉష్ణోగ్రత 35.9°Cగా నమోదు కాగా.. ఇదే సమయంలో దిల్లీలో 27°Cగా ఉంది. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు నగరంలో ప్రస్తుతం వాతావరణం మారిపోతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ సంస్థ బెంగళూరులోని ప్రజలకు తీవ్రతరం అవుతున్న వేడిమిపై రానున్న వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని అనేక ప్రాంతాలతో పోల్చితే బెంగళూరులో ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగుతున్నాయి. వాస్తవానికి మార్చి తొలినాళ్లలో స్టార్ట్ కావాల్సిన వేడి వాతావరణం ఈసారి ముందుగానే స్టార్ట్ అయ్యింది. గతంలోని వేసవిలకు భిన్నంగా ఈ సారి పరిస్థితులు ఉంటాయని చెబుతున్న వాతావరణ సంస్థ అధికారులు కాలాబుర్గీ లాంటి జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందంటున్నారు.
కర్ణాటకలో వాతావరణ మార్పులు ఉత్తర, కోస్తా ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా బెంగళూరు నగరంలో కూడా వేడి వేసవి కష్టాలు తప్పవని వెల్లడైంది. అయితే ఈ భారీ హెచ్చరికలు ఇప్పటికే బెంగళూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐటీ కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందిగా వెల్లడించిన వేళ.. నిరంతరం పెరుగుతున్న వేడి నీటి ఎద్దడి సమస్యలతో పాటు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో రానున్న సమ్మర్ లో ప్రజలకు తాగు నీటి ఎద్దడి రాకుండా నివారించటానికి మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ప్రజలు నీటిని గార్డెనింగ్, కార్లను క్లీన్ చేయటానికి, నగరంలో నిర్మాణ పనులు చేపట్టడానికి వినియోగించకూడదని హెచ్చరించింది. పైన పేర్కొన్న పనులకు నీటిని వృధా చేయవద్దని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. కమర్షియల్ వినియోగదారులైన మాల్స్, సినిమా హాల్స్ నీటిని అనవసరంగా వినియోగించరాదని కూడా పేర్కొంది. దీనిని పాటించని వ్యక్తులపై రూ.5000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఎవరైనా నీటి వృధా గురించి కంప్లెయింట్ చేసేందుకు 1916కి కాల్ చేయాలని అధికారులు సూచించారు.


Click it and Unblock the Notifications