Unemployment: నిరుద్యోగితపై ILO ఆందోళన.. పాపం ఉన్నత విద్యావంతులు.. ఎంత కష్టం వచ్చి పడిందో..
ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీలు తమ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని భావించడమే కాకుండా ఉగ్యోగుల్లో నైపుణ్య లేమిని కారణంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఆఫర్లు లేక వేతన జీవులు సతమతమవుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భారత్ లో ఉన్నత విద్యావంతులు ఎక్కువ శాతం నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఎటువంటి పాఠశాల విద్య లేని వారి కంటే బాగా చదువుకున్న యువకులే కొలువు విషయంలో తీవ్ర నిరుత్సాహ పడాల్సి వస్తుందంటూ కీలక నివేదిక విడుదల చేసింంది.

దేశంలో గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 29.1 శాతంగా ఉన్నట్లు ILO పేర్కొంది. సెకండరీ విద్య కలిగిన యువకుల్లో ఇది 18.4 శాతం ఉన్నట్లు తెలిపింది. అయితే చదవడం లేదా వ్రాయడం రాని వారిలో నిరుద్యోగిత రేటు కేవలం 3.4 శాతం మాత్రమే ఉన్నట్లు లెక్కగట్టింది. అంటే ఉన్నత విద్యావంతులు దాదాపు 9 రెట్లు ఎక్కువగా ప్రమాదాన్ని ఎదుర్కోనున్నట్లు స్పష్టం చేసింది.
'ఇండియా యువతలో ప్రధానంగా నిరుద్యోగం ఒక సమస్యగా ఉంది. ప్రత్యేకించి సెకండరీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విద్యను కలిగి ఉన్న యువతలో ఇది కాలక్రమేణా తీవ్రమైంది' అని ILO ఆందోళన వ్యక్తం చేసింది. శ్రామిక శక్తి నైపుణ్యాలు, మార్కెట్లోని ఉద్యోగాల మధ్య చాలా అసమతుల్యత ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పాఠశాల విద్యావ్యవస్థలో డొల్లతనం కాలక్రమేణా ఆర్థిక అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన హెచ్చరికలను ILO రిపోర్టు సమర్థించింది.
'దేశీయ యువతలో నిరుద్యోగం రేటు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కంటే ఎక్కువగా ఉంది. కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం సిద్ధమైన యువతకు వ్యవసాయేతర రంగాలలో తగిన వేతనంతో కూడిన ఉద్యోగాలను భారత ఆర్థిక వ్యవస్థ సృష్టించలేకపోయింది. పెరుగుతున్న నిరుద్యోగ రేటుకు ఇది ప్రముఖ కారణంగా తయారైంది' అని ILO పేర్కొంది.


Click it and Unblock the Notifications