UPI Payments: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను చేరువచేసింది. దీంతో చాలా మంది మారుమూల గ్రామాల్లో సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇవి ఉచితంగానే లభిస్తున్నాయి. కాకపోతే వీటిపై ఛార్జీలు వసూలు చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వ పరిశీలిస్తోందని 'Charges for PPI-based UPI payments--The Deception' పేరుతో విడుదలైన తాజా నివేదిక చెబుతోంది.
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఫెసిలిటేటింగ్ ఛార్జీల రూపంలో 0.3 శాతం వసూలు చేయటం ద్వారా చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ సాధ్యతపై కేంద్ర ప్రభుత్వం పరిగణించవచ్చని IIT బాంబే అధ్యయనం సూచించింది. ఈ రుసుము వసూలు చేయటం ద్వారా దాదాపు రూ.5,000 కోట్లను ఆర్జించగలదని అంచనా వేయబడింది. దీనికి ముందు ఏప్రిల్ 1 నుంచి వ్యాపారులకు UPI ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల వినియోగం కోసం లావాదేవీ మొత్తంపై 1.1 శాతం ఇంటర్‌చేంజ్ రుసుమును NPCI ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ వాలెట్ ఆధారిత UPI బిజినెస్ లావాదేవీలపై ఇవి వర్తిస్తాయి.

ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా బ్యాంక్ లేదా సిస్టమ్ యూపీఐ చెల్లింపులను అందిస్తున్నందుకు వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు వేయకూడదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూజర్ల నుంచి ఎలాంచి రుసుములను వసూలు చేయకూడదు. ఈ కారణంగా ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు ఉచితంగా లభిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తాజా బడ్జెట్ ప్రసంగంలో "2022లో UPI ద్వారా రూ.126 లక్షల కోట్ల.. 7,400 కోట్ల డిజిటల్ చెల్లింపులు " జరిగాయని వెల్లడించారు.
ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో కరెన్సీ ప్రింటింగ్, నిర్వహణకు ప్రభుత్వం భారీగానే వెచ్చిస్తోంది. గత కొన్నేళ్లుగా కరెన్సీ ప్రింటింగ్‌పైనే ఏటా సగటున రూ.5,400 కోట్లు ఖర్చు చేయగా.. కరెన్సీ నిర్వహణపై ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలింది. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రమోట్ చేయటం ద్వారా ఏటా వేల కోట్లను ఆదా అవుతాయని తెలుస్తోంది. పైగా UPI కోసం చేసే వ్యయం చాలా తక్కువగా ఉండవచ్చు. అయితే రానున్న కాలంలో ఒకవేళ ఛార్జీలను ప్రభుత్వం ప్రవేశపెడితే ప్రజలు డిజిటల్ చెల్లింపులకు క్రమంగా దూరం జరిగే అవకాశాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications