అమ్మా నా తొలి జీతం ఇదిగో.. క్యాష్ రూపంలో తెచ్చి ఇచ్చిన కొడుకు..హృదయాలను హత్తుకుంటున్న పేరెంట్స్ రియాక్షన్..
మారుతున్న కాలంలో అన్నీ డిజిటల్ మయం అయిపోతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం వచ్చిన కొత్తలో మొదటి జీతాన్ని కవర్ లో పెట్టి కన్నవారి చేతుల్లో పెడితే, ఆ తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందం, ఆ నోట్ల స్పర్శ ఇచ్చే తృప్తి ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ లో పడే 'శాలరీ క్రెడిటెడ్' అనే ఒక చిన్న ఫోన్ మెసేజ్ లో దొరకడం లేదు. సరిగ్గా ఇదే విషయంపై కొడుకు, తండ్రి మధ్య జరిగిన ఒక ఆత్మీయ చర్చ, ఒక అద్భుతమైన భావోద్వేగ క్షణానికి దారితీసింది.
తన ఐఐఎం (IIM) చదువు పూర్తయిన తర్వాత వచ్చిన మొదటి జీతాన్ని పూర్తిగా నగదు రూపంలో మార్చుకుని, డిజిటల్ బదిలీలను పక్కనపెట్టి, కేవలం ఆ డబ్బును కన్నవారి చేతుల్లో పెట్టాలనే ఒకే ఒక్క మధురమైన లక్ష్యంతో అశ్వజీత్ కాంబ్లే అనే యువకుడు పూణేలోని తన ఇంటికి చేరుకున్నాడు. "కేవలం ఈ ఒక్క ఉద్దేశ్యం కోసమే నేను పూణేకు వచ్చాను" అంటూ అశ్వజీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆ హృదయపూర్వక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజన్ల మనసులను కదిలిస్తోంది.

"సాంకేతికంగా ఇది నా మొదటి జీతం కాకపోవచ్చు, కానీ ఐఐఎం తర్వాత వచ్చిన నా మొదటి జీతం.. కాబట్టి దీనికి ఎంతో విలువ ఉంది. చివరికి నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా తల్లిదండ్రులే" అని అశ్వజీత్ ఎంతో కృతజ్ఞతతో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అశ్వజీత్ ఆలోచనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
డబ్బును చేత్తో పట్టుకుని ఆ అనుభూతిని పొందడంలో ఉండే ఆనందాన్ని అందరూ అర్థం చేసుకోలేరు.. మీరు చాలా మంచి పని చేశారు అని ఒకరు వ్యాఖ్యానించగా.. ఒక తల్లిగా మీ అమ్మగారి కళ్లలోని భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక" అంటూ మరొకరు దీవించారు. సంపాదించడం అంత సులభం కాదని తెలిసే ఈ క్షణం కోసమే ప్రతి కొడుకు ఎదురుచూస్తాడు అంటూ ఇంటర్నెట్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఒక సగటు మధ్యతరగతి కుటుంబం ఎన్నో ఏళ్లుగా పడిన కష్టం, త్యాగాల తాలూకు మరో కోణం కూడా ఉంది. ఈ వీడియోలో అశ్వజీత్ పక్కనే నిలబడి ఉన్న అతని అన్నయ్య కథ మరింత స్ఫూర్తిదాయకమైనది.
అశ్వజీత్ అన్నయ్య దాదాపు ఆరేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని, ఇటీవలే యూపీఎస్సీ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారిగా ఉద్యోగం సాధించాడు. ఆరేళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎలాంటి సంపాదన లేకపోవడంతో అన్నయ్యగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ, తమ్ముడు అశ్వజీత్, తల్లిదండ్రులు అతని కలపై నమ్మకంతో నిరంతరం అండగా నిలిచారు.
అటు తమ్ముడు అశ్వజీత్ సైతం తన కెరీర్ తొలినాళ్లలో తక్కువ జీతం వస్తున్నప్పటికీ, తండ్రికి ఆర్థిక భారం తగ్గించడం కోసం వీడియో ఎడిటింగ్, 3D డిజైన్ వంటి ఫ్రీలాన్స్ పనులు చేస్తూ కుటుంబానికి చేతనైన సహాయం అందించాడు. ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద పోరాటం తర్వాత.. ఒకవైపు అన్నయ్య ఐఎఫ్ఎస్ అధికారి కావడం, మరోవైపు తమ్ముడు ఐఐఎం పూర్తి చేసి తన మొదటి salary తల్లిదండ్రుల చేతుల్లో పెట్టడం ఆ కుటుంబాన్ని ఆనందబాష్పాల్లో ముంచెత్తింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వీడియో కేవలం ఒక జీతం అందజేత మాత్రమే కాదని, అది ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఏళ్ల తరబడి చేసిన త్యాగాలను ప్రతిబింబించే ఒక నిఖార్సైన విజయ చిత్రమని అశ్వజీత్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. కష్టం విలువ తెలిసిన పిల్లలు కన్నవారికి ఇచ్చే అతిపెద్ద కానుక ఇదేనేమో!


Click it and Unblock the Notifications
