ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) చండీగఢ్ బ్రాంచ్ లో వెలుగుచూసిన భారీ మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు రూ. 590 కోట్ల హర్యానా ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఈ ఫ్రాడ్ వార్త బయటకు రావడంతో, సాధారణ ఖాతాదారులు తమ డబ్బు సురక్షితమేనా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? మీ డిపాజిట్లు ఎంతవరకు సేఫ్? అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఇటీవల ఐడీఎఫ్‌సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ ఛేంజీలకు సమర్పించిన నివేదిక ప్రకారం.. చండీగఢ్ బ్రాంచ్ లోని కొందరు ఉద్యోగులు హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన సుమారు రూ. 590 కోట్ల నిధులను పక్కదారి పట్టించినట్లు తెలిసింది. దీనిపై బ్యాంక్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అంతర్గత విచారణను కూడా వేగవంతం చేసింది.
మీ సేవింగ్స్, ఎఫ్‌డీలు ప్రమాదంలో ఉన్నాయా?
ఈ వార్త వినగానే ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంక్ కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంట్లు లేదా ఎఫ్‌డీల గురించి ఆందోళన చెందడం సహజం. అయితే బ్యాంక్ యాజమాన్యం దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ మోసం కేవలం హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన నిర్దిష్ట అకౌంట్లకు మాత్రమే పరిమితమైందని, సాధారణ రిటైల్ కస్టమర్ల డబ్బుకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. చండీగఢ్ బ్రాంచ్‌లోని ఇతర కస్టమర్లపై కూడా దీని ప్రభావం ఉండదని బ్యాంక్ భరోసా ఇచ్చింది.
ఖాతాదారుల హక్కులేంటి?
ఒకవేళ మీ ఖాతాలో ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగితే.. అది తెలిసిన 3 పనిదినాల్లోపు బ్యాంక్ కు ఫిర్యాదు చేయాలి. అకౌంట్ భద్రత గురించి సమాచారాన్ని అడిగే హక్కు ప్రతి ఖాతాదారుడికి ఉంటుంది. ప్రస్తుతానికి డబ్బు విత్ డ్రా చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) గురించి తెలుసా?
ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా బ్యాంక్ విఫలమైతే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) పథకం కింద ప్రతి ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండూ కలిసి ఉంటాయి. సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), రికరింగ్ డిపాజిట్లు (RD) అన్నీ ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి.
కస్టమర్లు ఏం చేయాలి?
- సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు వదంతులను నమ్మకండి.
- బ్యాంక్ నుంచి వచ్చే అధికారిక మెయిల్స్ లేదా మెసేజ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి.
- భద్రతా చర్యల్లో భాగంగా మీ డిపాజిట్లను వేర్వేరు బ్యాంకుల్లో ఉంచుకోవడం ఎప్పుడూ మంచిదే.
- మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తరచూ పరిశీలిస్తూ ఉండండి.
ప్రస్తుతానికి ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంక్ పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మోసం కేవలం ఒక బ్రాంచ్ లోని ప్రభుత్వ నిధులకు మాత్రమే పరిమితం కావడం ఇక్కడ ఊరట కలిగించే విషయం.


Click it and Unblock the Notifications