Q4 Results: క్యూ4లో 26 శాతం లాభాల క్షీణత.. కుప్పకూలిన స్టాక్.. నిపుణులు ఏమన్నారంటే..
ICICI Prudential: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ4 ఫలితాలను కార్పొరేట్ కంపెనీలు ఒకదాని తర్వాత మరొకటి ప్రకటిస్తున్నాయి. అయితే వ్యాపార అనిశ్చితులతో కొన్ని కంపెనీల ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువగా నమోదు కావటం ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తోంది.
స్టాక్ మార్కెట్ బూమ్ మధ్య ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేర్లు నేడు భారీ క్షీణతను చూశాయి. ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 7 శాతం పతనమైంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం భారీ క్షీణతకు గురైనట్లు బయటకు రావటంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. చాలా మంది కంపెనీ షేర్లను విక్రయించి తమ పెట్టుబడులను నిష్క్రమిస్తున్నారు. ఈరోజు స్టాక్ బీఎస్‌ఈలో 6.73 శాతం క్షీణించి రూ.553.15 వద్దకు చేరుకుంది. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు 6.24 శాతం తగ్గి రూ.556.75 వద్దకు చేరుకున్నాయి.

అధిక ఖర్చుల కారణంగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 26 శాతం తగ్గి రూ.174 కోట్లకు చేరుకుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆర్థిక ఫలితాల ప్రకటన సమయంలో వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బీమా కంపెనీ రూ.235 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాలను పరిశీలిస్తే.. 2023-24లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నికర లాభం 5 శాతం పెరిగి రూ.852 కోట్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది కంటే అధికం. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.0.60 డివిడెండ్ ప్రకటించింది.
ఈ క్రమంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేర్లపై విదేశీ బ్రోకరేజ్ జెఫరీస్ బుల్లిష్ వైఖరిని కొనసాగించింది. బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్లకు 'BUY' రేటింగ్ అందించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.680గా పేర్కొంది. వాస్తవానికి నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసినప్పటికీ కంపెనీ వృద్ధి సామర్థ్యాలపై జెఫరీస్ సానుకూలంగా ఉంది. అలాగే JM ఫైనాన్షియల్ కూడా కంపెనీ షేర్లకు 'BUY' కాల్‌ని కొనసాగించింది. ఒక్కో షేరుకు రూ.736 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


Click it and Unblock the Notifications