ICICI Bank: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ అద్భుతమైన పనితీరును కనబరిచింది.
డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి ఐసీఐసీఐ నికర లాభం రూ.10,271.54 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో లాభం కేవలం రూ.8,311.85 కోట్లుగా నిలిచింది. అంటే ఏడాది ప్రాతిపదికన 23.57 శాతం లాభం వృద్ధి చెందింది. వాస్తవానికి ఫలితాల విడుదలకు ముందర విశ్లేషకులు లాభాన్ని 19-25 శాతం మధ్య పెరుగుతుందని అంచనా వేశారు.

మూడో త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,049.37 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 582.63 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. గత ఏడాది డిసెంబర్ క్వార్టర్ కంటే తక్కువని చెప్పుకోవాలి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ మెుత్తం కేటాయింపులు అత్యధికంగా రూ.2,257.44 కోట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం పెరిగి రూ.16,465 కోట్ల నుంచి రూ.18,678 కోట్లకు చేరుకుంది. స్థూల NPA నిష్పత్తి డిసెంబర్ 31, 2023 నాటికి 2.30 శాతానికి పడిపోయింది.
ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 19.8 శాతం పెరిగి రూ.4,987 కోట్ల నుంచి రూ.5,975 కోట్లకు పెరిగిందని ప్రైవేట్ బ్యాంక్ ప్రకటించింది. అలాగే రుసుముల నుంచి వచ్చిన ఆదాయం త్రైమాసికంలో 19.4 శాతం పెరిగి రూ.5,313 కోట్లుగా నమోదైంది. క్యూ3లో రిటైల్, గ్రామీణ, వ్యాపార బ్యాంకింగ్ మరియు ఎస్ఎమ్ఈ కస్టమర్ల నుంచి వచ్చే ఫీజులు మొత్తం ఫీజుల్లో 79 శాతంగా ఉన్నాయి. అలాగే ఈ త్రైమాసికంలో రూ.123 కోట్ల ట్రెజరీ లాభాన్ని నమోదు చేసుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications