ICICI Bank: 40 శాతం పెరిగిన ఐసీఐసీఐ లాభాలు.. వామ్మో ఇన్ని కోట్లా..!!
ICICI Q1 Results: దేశంలోని అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఐసీఐసీఐ తన మెుదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఊహించినదాని కంటే మంచి పనితీరును కనబరిచింది.
జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ పన్ను తర్వాత నికర లాభం రూ.9,648 కోట్లుగా నివేదించింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 39.7 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం కేవలం రూ.6,905 కోట్లుగా ప్రకటించింది. భారీగా లాభాలు పెరగటంతో ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తొలి త్రైమాసికంలో కోర్ నిర్వహణ లాభం 35.2 శాతం పెరిగి రూ.13,887 కోట్లకు చేరుకోగా.. ఫీజు ఆదాయం 14.1 శాతం పెరిగి రూ.4,843 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 38 శాతం పెరిగి రూ.18,227 కోట్లకు చేరుకుంది. అయితే నికర వడ్డీ మార్జిన్ (NIM) Q1లో 4.78 శాతంగా ఉంది. ఇది గత ఏడాది మెుదటి క్వార్టర్లో 4.01 శాతంగా, మార్చి త్రైమాసికంలో 4.90 శాతంగా ఉంది. ఇదే క్రమంలో NPAలు స్వల్పంగా పెరిగి రూ.31,822,39 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ త్రైమాసికంలో రైటాఫ్‌లు, అమ్మకాలు మినహా స్థూల NPAలకు నికర అదనంగా రూ.1,807 కోట్లుగా ఉంది. అలాగే బ్యాంక్ ఈ కాలంలో రూ.1,169 కోట్ల స్థూల NPAలను వదిలించుకుంది. వ్యాపార బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియో సంవత్సరానికి 30.4 శాతం, దేశీయ కార్పొరేట్ పోర్ట్‌ఫోలియో 19.3 శాతం వృద్ధిని సాధించింది. అలాగే బ్యాంక్ డిపాజిట్లు 17.9 శాతం వృద్ధితో రూ.12,38,737 కోట్లకు చేరుకున్నాయి.
బ్యాంక్ దేశీయ రుణ పోర్ట్‌ఫోలియో జూన్ త్రైమాసికంలో 20.6 శాతం పెరిగి రూ.10,25,310 కోట్లకు చేరుకుంది. CASA నిష్పత్తి 42.6 శాతంగా నమోదైంది. అయితే సగటు కరెంట్ ఖాతా డిపాజిట్లు సంవత్సరానికి 9.2 శాతం పెరిగాయి. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు కూడా 5.6 శాతం ఏడాది ప్రాతిపదికన పెరిగాయి.


Click it and Unblock the Notifications