ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా లేఆఫ్స్ (Layoffs) గోలే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతున్నాయని అందరూ భయపడుతున్నారు. అయితే ఏఐ రాకముందే కార్పొరేట్ చరిత్రలో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఉదంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) గురించి. 1993లో ఈ కంపెనీ ఏకంగా 60,000 మందిని ఇంటికి పంపించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

ఒకప్పుడు ఐబీఎం (IBM) కంపెనీలో ఉద్యోగం అంటే అది జీవితకాల భద్రతకు నిదర్శనం. 'బిగ్ బ్లూ'గా పిలిచే ఈ కంపెనీలో చేరిన వారు రిటైర్మెంట్ వరకు తమకు తిరుగులేదని భావించేవారు. ఉద్యోగులకు క్లబ్ మెంబర్‌షిప్ లు, బంగారు గడియారాలు బహుమతిగా ఇచ్చే సంస్కృతి అక్కడ ఉండేది. కానీ, 1990వ దశకం ఆరంభంలో ప్రపంచం మారుతున్న తీరును ఐబీఎం గుర్తించలేకపోయింది. గదుల అంత పరిమాణం ఉండే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల తయారీలోనే ఐబీఎం(IBM) మునిగిపోయింది. అప్పటికే యాపిల్, కాంపాక్ వంటి కంపెనీలు పర్సనల్ కంప్యూటర్లతో (PCs) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
60 వేల మందిపై వేటు: ఎందుకు జరిగింది?
ఫలితంగా 1993 నాటికి ఐబీఎం సుమారు 8 బిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూసింది. అప్పట్లో ఇది అమెరికన్ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టం. కంపెనీ మనుగడ సాగించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని భావించిన అప్పటి సీఈఓ లూయిస్ గెర్స్ట్‌నర్, 'లేఆఫ్స్' (Layoffs) అస్త్రాన్ని ప్రయోగించారు. జూలై 1993 లో ఒకే ఏడాదిలో 60,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒక కుటుంబంలా భావించిన కంపెనీ నుంచి అంత మందిని బయటకు పంపడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
ఇప్పటి కంపెనీలు ఎందుకు అలా చేయలేకపోతున్నాయి?
నేటి కాలంలో అమెజాన్, గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా లేఆఫ్స్ చేస్తున్నాయి. కానీ, ఏ కంపెనీ కూడా ఒకేసారి 60 వేల మందిని తొలగించిన దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో తొలగింపులు చేస్తే కంపెనీ తీవ్రమైన సంక్షోభంలో ఉందని ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే ఇప్పటి కంపెనీలు విడతల వారీగా 5 వేలు లేదా 10 వేల మందిని తొలగిస్తూ మేనేజ్ చేస్తున్నాయి. అలాగే ఇప్పటి టెక్ కంపెనీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు, వారి తొలగింపులు అధికారిక లెక్కల్లోకి రావు.
ఐబీఎం నేర్పుతున్న పాఠం ఇదే..
1993 లో ఐబీఎం చేసిన ఆ భారీ తొలగింపు ఇప్పటికీ కార్పొరేట్ ప్రపంచంలో ఒక నల్లని మచ్చగా మిగిలిపోయింది. ఆనాడు టెక్నాలజీ మార్పును అందిపుచ్చుకోవడంలో విఫలమవ్వడం వల్లే అంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏఐ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కాలంతో పాటు మారని వారు, కొత్త టెక్నాలజీని నేర్చుకోని వారు లేఆఫ్స్ (Layoffs) బారిన పడటం ఖాయమని ఈ చరిత్ర మనకు పాఠం చెబుతోంది. ఉద్యోగ భద్రత అనేది కంపెనీ ఇచ్చే హామీ కాదు, మన నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందని ఈ ఐబీఎం ఉదంతం నిరూపించింది.


Click it and Unblock the Notifications