అమెజాన్ ఉద్యోగం వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ యువకుడు.. కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
మన దేశంలో ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లేదా అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలో కొలువు దొరికితే.. లైఫ్ సెటిల్ అయిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ, సమాజం పెట్టే కండిషన్లు, రూల్స్ పక్కన పెట్టి.. మనసుకు నచ్చిన పని చేస్తూ ఆనందాన్ని వెతుక్కునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మన హైదరాబాద్ (Hyderabad) కి చెందిన కుమార్ అనే వ్యక్తి, లగ్జరీ కార్పొరేట్ లైఫ్‌ను వదిలేసి ఉబెర్ డ్రైవర్‌గా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వైరల్ వీడియోతో బయటపడ్డ అసలు కథ
చేతనా సింగ్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణంలో భాగంగా డ్రైవర్ కుమార్‌తో మాటలు కలిపింది. వారి మధ్య జరిగిన సంభాషణ కాస్త కెరీర్, లైఫ్, సంతోషం అనే ఆసక్తికరమైన టాపిక్ వైపు మళ్లింది. కుమార్ చెప్పిన విషయాలు విని ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ సంభాషణను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ స్టోరీ కాస్తా వైరల్‌గా మారింది.
అమెజాన్ ఉద్యోగం వదిలి.. స్టీరింగ్ పట్టి!
కుమార్ గతంలో అమెజాన్ (Amazon) కంపెనీలో ఒక మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసేవాడు. కానీ ఆ ఆఫీస్ వాతావరణం, నాలుగు గోడల మధ్య కూర్చోవడం అతనికి నచ్చలేదు. దీంతో 2014లో హైదరాబాద్‌లో ఉబెర్ సేవలు ప్రారంభమైన కొత్తలోనే తన కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఉబెర్ డ్రైవర్‌గా మారాడు.
గడిచిన పదేళ్లలో అతను ఏకంగా 23,600 కి పైగా ట్రిప్స్ పూర్తి చేశాడు. "నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం.. నా హైదరాబాద్ నగరాన్ని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడమే నాకు ముఖ్యం. ప్రతిరోజూ కొత్త కొత్త మనుషులను కలవడం, వారి కథలు వినడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పొద్దున నుండి సాయంత్రం వరకు నేను ప్రతి రైడ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను" అని కుమార్ నవ్వుతూ చెప్పాడు.
ఇంటర్నెట్ ఫిదా.. సలాం కొడుతున్న నెటిజన్లు
సాధారణంగా బాధ్యతలు, సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో చాలామంది తమ ప్యాషన్‌ను చంపేసుకుని బతుకుతుంటారు. కానీ, కుమార్ వాటన్నింటినీ దాటి తనకు నచ్చిన పనిని ఎంచుకుని, సంతోషంగా జీవించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అతను ఈ రీజియన్‌లోనే 'హైయెస్ట్ రేటెడ్' ఉబెర్ డ్రైవర్లలో ఒకరిగా నిలిచాడు.
ఈ వీడియో చూసిన ఒక యూజర్.. "మీరు గొర్రెల మందలా కాకుండా, మీ మనసుకు నచ్చిన సొంత బాటను ఎంచుకున్నారు.. గ్రేట్ వర్క్ సార్" అని కామెంట్ చేయగా.. మరొకరు "ఈ స్టోరీ చదివాక నేను పక్కన పెట్టిన నా పాత ప్యాషన్‌ను మళ్లీ గుర్తుచేసుకున్నాను.. థాంక్స్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హోదా, పెద్ద పెద్ద ఉద్యోగాల కంటే.. మనశ్శాంతి, సంతోషమే జీవితంలో ముఖ్యమని కుమార్ నిరూపించాడు.


Click it and Unblock the Notifications