రూ. 40 లక్షల జీతం..ఎందుకు సంపాదిస్తున్నానో తెలియదు..రాత్రిళ్లు నిద్ర రావడం లేదంటూ బోరుమంటున్న ఉద్యోగి..
ఎంత డబ్బు ఉంటే మనిషి ప్రశాంతంగా నిద్రపోగలడు? ఏడు అంకెల జీతం, విలాసవంతమైన లగ్జరీ కారు, సొంత ఇల్లు.. ఇవన్నీ ఒక మనిషి ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాడని చెప్పడానికి సరిపోతాయా అంటే ప్రస్తుత కాలంలో 'కాదు' అనే సమాధానమే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే భారీ ప్యాకేజీలు, స్టార్టప్ విజయాలు, విలాసవంతమైన జీవనశైలిల మధ్య.. సమాజం దృష్టిలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తీవ్రమైన మానసిక అశాంతితో, తాము వెనుకబడిపోతున్నామేమో అన్న ఆందోళనతో బతుకుతున్నారు. సరిగ్గా ఇదే అంశంపై ఎవర్హోప్ ఆంకాలజీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ సన్నీ గార్గ్ పంచుకున్న ఒక కథనం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కదిలిస్తోంది. విజయం, ఇతరులతో పోలిక, నిరంతరం పరుగు పెట్టాలనే తపన మనిషిని ఎలా మానసిక రోగిగా మారుస్తుందో ఈ కథ అద్దం పడుతోంది.
డాక్టర్ గార్గ్ ఇటీవల గుర్గావ్‌కు చెందిన ఒక 34 ఏళ్ల యువ వృత్తి నిపుణుడిని కలిశారు. పైకి చూస్తే అతను ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక మంచి 2BHK అపార్ట్‌మెంట్‌లో నివాసం, తిరగడానికి బ్రాండెడ్ బీఎమ్‌డబ్ల్యూ కారు, సంవత్సరానికి సుమారు రూ. 40 లక్షల భారీ సంపాదన. ఏ సగటు భారతీయుడికైనా ఇది ఒక కలల జీవితం. కానీ, ఆ వ్యక్తి డాక్టర్ ముందు కూర్చుని తన ఆరోగ్యం చాలా క్షీణించిందని, రాత్రిపూట అస్సలు నిద్ర పట్టడం లేదని, నన్ను నేను చాలా పేదవాడిగా భావిస్తున్నానని ఆవేదన చెందాడు. మొదట వినడానికి ఇది వింతగా అనిపించినా, డాక్టర్ గార్గ్ మాత్రం నవ్వలేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక్క వ్యక్తి సమస్య కాదు.. నేటి ఆధునిక భారతీయ మధ్యతరగతి వృత్తి నిపుణులందరూ అనుభవిస్తున్న నిశ్శబ్ద నరకం.

గణాంకాల ప్రకారం చూస్తే సంవత్సరానికి రూ. 40 లక్షలు సంపాదించే వ్యక్తి భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగిన మొదటి 1% జనాభాలో ఉంటాడు. అయినా అతను తనను తాను పేదవాడిగా ఎందుకు భావిస్తున్నాడు అంటే దానికి కారణం అతని బ్యాంకు ఖాతా కాదు, అతను విజయాన్ని కొలిచే 'పోలిక స్థానం' మారిపోవడమే. పూర్వం రోజుల్లో మనుషులు తమ చుట్టుపక్కల వారితోనో, లేదా తమ గ్రామంలోని వారితోనో తమను పోల్చుకునేవారు.
కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ యువకుడు లింక్డ్‌ఇన్ ఓపెన్ చేసి, అక్కడ ఒక స్టార్టప్‌ను అమ్మి రూ.80 కోట్ల సంపదతో మెరిసిపోతున్న 28 ఏళ్ల యువకుడితో తనను తాను పోల్చుకుంటున్నాడు. దీనినే డాక్టర్ గార్గ్ "ఆధునిక పేదరికం" అని పిలిచారు. ఇక్కడ ఆదాయం పెరుగుతోంది, కానీ దానికంటే పది రెట్లు వేగంగా అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉండే అంతరమే మనిషిని నిద్రపోనివ్వడం లేదు.
ఈ మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గార్గ్ ఆ యువకుడికి మూడు సాధారణ ప్రశ్నలు వేశారు. ఆ సమాధానాలు అసలు వ్యాధి ఏంటో బయటపెట్టాయి. గత సంవత్సరంలో, "నాకు ఉన్నది చాలు, నేను తృప్తిగా ఉన్నాను" అని నీకు నువ్వు ఎప్పుడైనా చెప్పుకున్నావా అని మొదటి ప్రశ్న అడగ్గా, ఎప్పుడూ లేదు అని సమాధానం వచ్చింది. అసలు ఈ డబ్బంతా నువ్వు ఎవరి కోసం, ఎందుకు సంపాదిస్తున్నావు అని రెండవ ప్రశ్న అడగ్గా, నాకు నిజంగా తెలియదని, నా చుట్టూ ఉన్నవారంతా రేసుగుర్రాల్లా ముందుకు సాగిపోతుంటే తాను వెనుకబడిపోకూడదని పరుగెడుతున్నానని ఆ యువకుడు ఒప్పుకున్నాడు. ఇక నీ జీవితంలో డబ్బు కోసం కాకుండా, కేవలం నీ మనసు సంతోషం కోసం చేసిన పని ఒక్కటైనా ఉందా అని చివరి ప్రశ్న అడిగినప్పుడు, ఆ యువకుడు కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత లేదు అని సమాధానమిచ్చాడు.
ఈ సమాధానాలు ఆర్థిక లోపాన్ని కాదు.. జీవితంలో పరమార్థం, అనుబంధాలు, ఆత్మసంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తున్నాయి. డబ్బు మాత్రమే ప్రతి పనికి కొలమానం అయినప్పుడు, మనిషి ఒక యంత్రంగా మారిపోతాడు. ఎక్కువ డబ్బు కేవలం డబ్బుకు సంబంధించిన సమస్యలను మాత్రమే తీర్చగలదు కానీ, అది మనశ్శాంతిని ఇవ్వలేదు. ఈ కథ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలిక అనేది ఎప్పుడూ మన సంతోషాన్ని చంపేసే ఒక దొంగ అని ఒకరు వ్యాఖ్యానించగా, ఆత్మసంతృప్తి ముఖ్యం సోదరా, ఇతరులతో పరుగు పందెం ఆపి నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించు అని మరొకరు హితవు పలికారు.
మీరు రూ. 40 లక్షలు సంపాదించినా లేదా రూ. 4 కోట్లు సంపాదించినా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ మూడు ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి అని డాక్టర్ గార్గ్ సలహా ఇచ్చారు. ఎందుకంటే సమాజంలో డబ్బు సమస్యలను పరిష్కరించడం చాలా సులభం, కానీ మనస్సుకు సంబంధించిన, గుర్తింపునకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం చాలా కష్టం. నిరంతరం వేరొకరితో పోల్చుకుంటూ విజయాన్ని కొలిస్తే, ఆ విజయం జీవితంలో ఎప్పటికీ 'సరిపోదు'.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
