Hyundai: అంతర్జాతీయంగా మందగమనం నెలకొన్న సమయంలోనూ దేశీయ వాహన పరిశ్రమ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఏళ్ల తరబడి ఇండియన్ మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ IPOగా వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (HMIL) ఈ ఏడాది సంచలనం సృష్టించబోతోంది. దీపావళి సందర్భంగా నవంబర్‌లో భారతీయ మార్కెట్లలో తన IPOను జాబితా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. 1996న స్థాపించబడిన ఈ కంపెనీ.. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది మారుతి సుజుకి ఇండియా తర్వాత HMIL భారతదేశపు రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన విక్రయదారుగా నిలిచింది. అయితే దీని IPO కోసం దిగ్గజ పెట్టుబడిదారులు సహా టాప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు పోటీపడుతున్నట్లు సమాచారం. గోల్డ్‌మన్ సాచ్స్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC, డ్యుయిష్ బ్యాంక్ మరియు UBS ప్రతినిధులు గత వారం సియోల్‌లో హ్యుండాయ్ నాయకత్వంతో చర్చలు కూడా జరిపారు.
కంపెనీ విలువను 22 నుంచి 28 బిలియన్ డాలర్లుగా బ్యాంకర్లు నిర్ణయించారు. అంటే దాదాపు 1.82 నుంచి 2.32 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉండవచ్చని అంచనా. 3.3-5.6 బిలియన్ డాలర్లు సమీకరించే లక్ష్యంతో 15-20 శాతం డైల్యూట్ చేయాలని హ్యుండాయ్ భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా మహారాష్ట్రలో 6 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు 2024లో జనవరిలో అవగాహన ఒప్పందం సైతం కుదిరింది.


Click it and Unblock the Notifications