Dairy Milk: డైరీ మిల్క్ చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో దాదాపు ఉండరు. ప్రత్యేకమైన రోజుల్లో వీటిని గిఫ్ట్ ఇచ్చి ఎదుటివారిపై తమ ప్రేమను చూపించడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. అయితే వీటిని తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ.
నగరానికి చెందిన రాబిన్ జాకీస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని ఓ దుకాణం నుంచి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశారు. తినేందుకు దానిని ఓపెన్ చేసినప్పుడు అందులో ఓ పురుగు కదలుతూ కనిపించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు వినియోగదారుడు ఓ వీడియోను Xలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారింది.

'అమీర్‌పేట్‌లో మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ చాక్లెట్‌లో ఒక పురుగు పాకుతున్నట్లు గుర్తించా. గడువు ముగియనున్న ఉత్పత్తుల విషయంలో నాణ్యత తనిఖీలు ఉండవా? ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?' అంటూ తన పోస్టులో రాబిన్ ఆవేదన వ్యక్తం రాశారు. ఈ పోస్ట్‌పై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వైరల్ ఘటనపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సంస్థ స్పందించింది. 'హాయ్, మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్) అత్యధిక నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. మీకు కలిగిన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. మీ సమస్యను పరిష్కరించడానికి దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు కొనుగోలు వివరాలను [email protected]కు పంపించమని అభ్యర్థిస్తున్నాము. మీ ఫిర్యాదుపై తగిన చర్య తీసుకుంటాము. ధన్యవాదాలు' అని సమాధానం ఇచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సైతం ఓ ప్రత్యేక ప్రతిస్పందనలో 'ఈ సమస్యపై సంబంధిత ఆహార భద్రత బృందం @AFCGHMC అప్రమత్తమైంది. ఫిర్యాదు త్వరగా పరిష్కరించబడుతుంది' అని పేర్కొంది. అయితే క్యాడ్‌బరీ వంటి ప్రముఖ కంపెనీ ఉత్పత్తుల విషయంలో ఇలా జరగడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు.


Click it and Unblock the Notifications