అప్పు చేయాలంటే చచ్చేంత భయంగా ఉంది.. లేఆఫ్స్ వణుకుపై టెక్కీ ఆవేదన!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు లగ్జరీ లైఫ్ స్టైల్, సొసైటీలో మంచి గౌరవం, నెలాఖరుకల్లా చేతినిండా జీతం. ఈ ధీమాతోనే ఐటీ ఉద్యోగులు ఇళ్లు, కార్లు, పర్సనల్ లోన్లు అంటూ ఎలాంటి ఆలోచన లేకుండా ఈఎంఐలు పెట్టుకునేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
వరుసగా సాగుతున్న లేఆఫ్స్ (layoffs) ఐటీ రంగాన్ని అతలాకుతలం చేస్తుండటంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ముత్తా నాగవంశీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు ఐటీ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ప్రస్తుతం తాను లోన్ తీసుకోవడానికి "చచ్చేంత భయపడుతున్నాను" (Dead scared) అంటూ ఆయన చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

ఐదేళ్ల క్రితం వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు!
హైదరాబాద్ టెక్కీ నాగవంశీ తన పోస్ట్‌లో ఐటీ పరిశ్రమలో మారుతున్న కాలానికి, పెరుగుతున్న భయానికి గల వ్యత్యాసాన్ని వివరించారు. "నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన లోన్ తీసుకోవాలన్నా నాకు భయం వేస్తోంది. ఒక ఐదేళ్ల క్రితం చూసుకుంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లెఫ్ట్, రైట్, సెంటర్ అంటూ ఇష్టమొచ్చినట్లు లోన్లు తీసుకునేవారు. ఎందుకంటే అప్పట్లో మంచి జాబ్ సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు.. వచ్చే ఏడాది తమ ఉద్యోగం ఉంటుందో లేదో ఎవరికీ క్లారిటీ లేదు. ఈ సమస్య కేవలం నాకే ఉందా? లేక అందరూ ఇదే ఫీల్ అవుతున్నారా?" అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు, తోటి ఐటీ ప్రొఫెషనల్స్ భారీగా స్పందిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఐటీ జాబ్స్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ (రేపు ఏం జరుగుతుందో చెప్పలేం) గా మారిపోయాయని శివమ్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. సమాజంలో అత్యంత నైపుణ్యం, తెలివైన వారిగా భావించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.. లోన్ తీరిస్తే తిరిగి కట్టగలనా లేదా అని భయపడే పరిస్థితి రావడం దేనికి సంకేతం? అసలు ఇంజనీరింగ్ అనేది ఇప్పటికీ బెస్ట్ కెరీరేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
'AI' తెచ్చిన ముప్పు.. ఖర్చులు తగ్గిస్తున్న ఉద్యోగులు!
గత 12 నెలలుగా ఐటీ పరిశ్రమలో మరో భారీ లేఆఫ్స్ (layoffs) పరంపర కొనసాగుతోంది. కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ రంగుల్లోకి మారిపోతూ పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు , రీస్ట్రక్చరింగ్ చేపడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఏఐ టెక్నాలజీల వల్ల గనుక సాఫ్ట్‌వేర్ శాలరీలు తగ్గితే లేదా పరిశ్రమ మరింత కుంచించుకుపోతే.. పాత లైఫ్ స్టైల్ అలవాటు పడి భారీగా క్రెడిట్ కార్డ్ బిల్లులు, హోమ్ లోన్ మార్ట్‌గేజ్‌లు పెట్టుకున్న వారు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ భయాల నేపథ్యంలోనే చాలామంది ఐటీ ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నారు.
నిపుణుల సలహా: అప్పులు వద్దు.. దాచుకోండి!
ఈ అస్థిరమైన పరిస్థితుల నుండి తట్టుకోవడానికి పలువురు సీనియర్ ఐటీ నిపుణులు సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు..
- ఎమర్జెన్సీ ఫండ్: కొత్తగా ఎలాంటి అప్పులు (Loans) చేయకండి. ముందు జాగ్రత్తగా కనీసం 6 నుండి 8 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్‌గా దాచుకోండి.
- వర్క్ ఫ్రమ్ హోమ్: వీలైతే సొంత ఊళ్లకు వెళ్లిపోయి 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సిటీల్లో ఉండే భారీ ఇళ్ల అద్దెలను ఆదా చేసుకోవచ్చు.
ఇకవీటితోపాటు అప్ స్కిల్లింగ్ కూడా ముఖ్యమే.. కేవలం పాత టెక్నాలజీలపైనే ఆధారపడకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా AI ఏజెంట్స్, ఎల్‌ఎల్‌ఎమ్‌లు (LLMs) ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా మాత్రమే ఉద్యోగాలను కాపాడుకోగలరని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications