Hyderabad Realty: విశ్వనగరం హైదరాబాద్ లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు మందగించినా, స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో రియాల్టీ డెవలపర్లు అపార్ట్ మెంట్ల ధరలను పెంచుతునే ఉన్నారు.
మధ్యతరగతి ప్రజలు గతంలో 2 BHK ఫ్లాట్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే పెరుగుతున్న జీవన ప్రమాణాల కారణంగా ఇప్పుడు వారు కాస్తా 3 BHK ఫ్లాట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగర పొలిమేరల్లోనూ ఇవి కోటి రూపాయల కంటే ఎక్కువ పలుకుతున్నాయి. 2 BHKలకు కూడా బిల్డర్లు 70 లక్షలు పైనే చెబుతున్నారు. దీంతో మిడిల్ క్లాస్ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

నైట్ ఫ్రాంక్ డేటా ప్రకారం 2023 జనవరి-జూన్ మధ్య మొత్తం 15 వేల 355 ఆస్తుల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. వీటి విలువ 16 వేల 712 కోట్లు. అయితే గత జూలై-డిసెంబరుతో పోల్చితే చాలా మేరకు తగ్గాయి. బ్యాంకు రుణాల వడ్డీ రేట్ల పెంపు కూడా ఏడాదిన్నర కాలంగా పెద్ద సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉండటానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ విక్రయాలను అధ్యయనం చేసే ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం లక్ష వరకు అమ్ముడుపోని అపార్ట్ మెంట్ ఫ్లాట్లతో హైదరాబాద్ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. నగరంలో 16 నెలల ఇన్వెంటరీ ఓవర్‌హాంగ్ ఉండగా.. ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం. నిర్మాణ వ్యయం, భూముల ధరలు పెరగడం వల్ల అమ్ముడుపోని ఫ్లాట్లు పెరిగినట్లు రియల్టర్లు చెబుతున్నారు.
భూముల వేలంలో ధరలు పెంచుతూ నగరంలో కృత్రిమ రియాల్టీ బూమ్ సృష్టిస్తున్నట్లు కొందరు రియల్టర్లు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం చదరపు గజం 50 వేలు కాగా ఇప్పుడు లక్షకు పైగా చేరిందని.. త్వరలో 20 శాతం పెరగనుండటమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ధరల పెరుగుదల కొనుగోలుదారులకు భారంగా మారడంతో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టినట్లు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications