హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. హ్యాకర్లు కంపెనీ సర్వర్‌లను హ్యాక్ చేసి, అనధికార ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ద్వారా రూ. 1.39 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన హైటెక్ సిటీలో చోటుచేసుకుంది.
బిల్లులు, అద్దెలు, విద్యా చెల్లింపుల కోసం ఫిన్‌టెక్ అప్లికేషన్‌లను నిర్వహించే ఈ కంపెనీ, సెప్టెంబర్ 15న అంతర్గత తనిఖీలో ఈ మోసాన్ని గుర్తించింది. మొత్తం రూ. 1,39,95,215 విలువైన డెబిట్‌లు జరిగినట్లు వెల్లడైంది. సాంకేతిక పరిశోధనల ప్రకారం, హ్యాకర్లు కంపెనీ సర్వర్‌లోకి అనధికారికంగా ప్రవేశించారు. భాగస్వామ్య బ్యాంకులకు అనేక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) అభ్యర్థనలను పంపడానికి దీనిని ఉపయోగించారు.

వివిధ ఖాతాలకు నిధుల బదిలీ అభ్యర్థనలు జరిగాయి. మోసపూరిత లావాదేవీలను చట్టబద్ధం చేయడానికి ఐపీ అడ్రస్‌లను వైట్‌లిస్ట్ చేశారు. కంపెనీ డేటాబేస్ సురక్షితంగా ఉన్నప్పటికీ, సర్వర్ మౌలిక సదుపాయాలు దుర్వినియోగమయ్యాయి.సంస్థ సీఈఓ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.
ఇక బెంగళూరులో మరోసారి సైబర్ మోసగాళ్ల ధోరణి వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తిని కూడా కేటుగాళ్లు లక్ష్యంగా ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ అధికారులమని చెప్పుకుంటూ, ఆమె వ్యక్తిగత వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినా, ఆమె అప్రమత్తత వల్ల మోసం విఫలమైంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 5న ఉదయం సుమారు 9:40 గంటలకు సుధా మూర్తికి ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తి తాను టెలికాం శాఖలో పనిచేస్తున్నానని చెప్పి, ఆమె మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానం కాలేదని పేర్కొన్నాడు. ఆ నంబర్ నుంచి అసభ్యకరమైన సందేశాలు పంపబడుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే స్పందించకపోతే మధ్యాహ్నానికి నంబర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించాడు.
అయితే ఆ వ్యక్తి మాట్లాడే తీరు, చూపిన తొందరపై అనుమానం వచ్చిన సుధా మూర్తి కాల్‌ను కొనసాగించలేదు. జాగ్రత్తతో ఆ నంబర్‌ను ట్రూకాలర్‌లో పరిశీలించగా "టెలికాం డిపార్ట్‌మెంట్" అని చూపించడం గమనార్హం. దీంతో విషయం మోసపూరితమని నిర్ధారించుకుని, ఆమె తరఫున గణపతి అనే వ్యక్తి జాతీయ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 20న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇక మరో ఘటనలో, చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ కె. సుధాకర్ భార్య ప్రీతిని కూడా మోసగాళ్లు బలికావించారు. ఆగస్టు 26న ముంబై సైబర్ క్రైమ్ అధికారులమని చెప్పుకుంటూ, వాట్సాప్ కాల్ ద్వారా ఆమెను నమ్మించారు. ఆమె బ్యాంకు ఖాతాలోకి అక్రమ లావాదేవీలు జరిగాయని అబద్ధపు కథ వేశారు. భయపెట్టే రీతిలో మాట్లాడి, ఆమెను గందరగోళానికి గురి చేశారు. చివరికి ఆమె నుంచి ఏకంగా రూ.14 లక్షలు మోసగాళ్లు కాజేశారు.
అయితే ప్రీతి వెంటనే ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఆ డబ్బును ట్రేస్ చేసి, సంబంధిత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఆ తరువాత మొత్తాన్ని తిరిగి బాధితురాలికి అందజేయడం విశేషం.


Click it and Unblock the Notifications