హైదరాబాద్ రాత్రి 2 గంటలు సమయం.. నగరమంతా ఊపిరి పీలుస్తూ నిద్రలోకి జారుకుంటోంది. రోడ్లపై వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీధి దీపాలు నిశ్శబ్దాన్ని నింపుకుని ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అలాంటి సమయంలో అర్థరాత్రి వేళ ఖాళీ రహదారిపై ఓ యువతి సైకిల్ తొక్కుతూ కనిపించింది. నగరంలోని కోకాపేట సైక్లింగ్ ట్రాక్‌పై, ఒక యువతి ఆనందంగా సైకిల్ తొక్కుతూ నవ్వుతూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కావ్య మేథి ఖండేల్వాల్ అనే యువతి పోస్ట్ చేసిన ఆ 44 సెకన్ల వీడియోలో.. తెల్లవారుజామున 2 గంటలకు ఆమె సైకిల్‌పై స్పీడ్‌గా ముందుకు సాగుతూ కనిపిస్తుంది. ఆమె ఒంటరిగా కాకుండా ట్రాక్‌పై మరికొందరు మహిళలు కూడా ఉత్సాహంగా సైక్లింగ్ చేస్తున్నారు. సాధారణంగా ఈ సమయాల్లో దేశంలోని అనేక నగరాల్లో మహిళలు రోడ్లపైకి రావడమే ప్రమాదంగా భావిస్తారు. కానీ హైదరాబాద్‌లో ఆ దృశ్యం పూర్తిగా భిన్నంగా కనిపించింది.

హైదరాబాద్, నేను తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ తొక్కుతున్నాను. వాతావరణం అద్భుతంగా ఉంది. నా జీవితంలో ఇలాంటి అనుభవం నాకు ఇప్పటివరకు ఎదురకాలేదని ఆమె కెమెరాకు చెబుతుంది. అంతే కాదు, ఆమె తన సోదరితో సరదాగా రేసు కూడా వేసింది. ఉత్సాహంతో నవ్వుతూ ఇది నా ట్రాక్, ఇది ఇలా కనిపిస్తుంది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నప్పుడు ఆమె ఆనందం గాల్లో తేలినట్టుగా అనిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాను ఒక్కసారిగా ఊపేసింది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ వీడియో మూడు మిలియన్లకు పైగా వీక్షణలు, రెండు లక్షలకు పైగా లైక్‌లు, దాదాపు రెండు వేల కామెంట్లు సంపాదించింది. చాలామంది హైదరాబాద్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడినప్పుడు నాకు వ్యక్తిగతంగా ప్రశంసలు వచ్చినట్టే అనిపిస్తుందని ఓ నెటిజన్ అన్నాడు. మరో నెటిజన్ తెల్లవారుజామున 2 గంటలకు సైక్లింగ్ సురక్షితమేనా? అని అడిగితే, శ్రేయ గుప్తా అనే యువతి వెంటనే స్పందిస్తూ..నేను ఇప్పటివరకు చూసిన అత్యంత సురక్షితమైన నగరం హైదరాబాద్!" అని రాసింది.
ఒక వినియోగదారు మీ ఆనందం మీ గొంతులో స్పష్టంగా వినిపిస్తుందని ఖండేల్వాల్‌ను అభినందించాడు. మరికొకరు భావోద్వేగంగా..ప్రతి భారతీయ నగరం, ప్రతి రహదారి ఇలా ఉండాలి. మనమందరం దానికి అర్హులం. కొనసాగించండి హైదరాబాద్ అని రాసుకొచ్చాడు.
ఈ వీడియో కేవలం అర్థరాత్రి సైక్లింగ్ రీలే కాదు. ఇది మహిళల భద్రత, స్వేచ్ఛ, రాత్రిపూట కూడా భయపడకుండా రోడ్లపై నడిచే హక్కు, నగర అభివృద్ధి.. ఇలాంటి ఎన్నో అంశాలపై చర్చను మళ్లీ తెరమీదకి తెచ్చింది. ఒక నగరం మహిళకు భద్రతగా అనిపిస్తే, ఆ నగరం నిజంగా ప్రగతిని సాధించినట్టని చాలా మంది రియాక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications