Success Story: కోడింగ్ రాకపోయినా.. మెంటార్ల కోసం స్వైపింగ్ యాప్! హైదరాబాద్ మహిళ సూపర్ సక్సెస్ స్టోరీ!
టెక్ ప్రపంచంలో ఆలోచనలకు కొదువ లేదు. కానీ, ఆ ఆలోచనలకు సాంకేతికతను జోడించి ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్‌గా మార్చడమే అసలైన సవాలు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయ నాయర్ ఆ సవాలును స్వీకరించింది. ఆమెకు ఎలాంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ప్రపంచంలోనే ఫస్ట్ స్వైప్ బేస్డ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ యాప్ ను తయారు చేసింది. అదే జీస్పాన్ (ZSpawn). ఈమె ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రశ్న నుంచి పుట్టిన ఆలోచన
సాధారణంగా.. సింగిల్స్ కోసం బోలెడు డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉంటాయి. అందులో వారు తమ భాగస్వాములను ఈజీగా స్వైప్ చేస్తూ సెలక్ట్ చేసుకుంటారు. అయితే ఇలాంటి సౌకర్యం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ లో ఎందుకు లేదు? కో-ఫౌండర్‌లు, మెంటార్‌లు లేదా నిపుణులు నెట్‌వర్కింగ్ కోసం వారాలు, నెలలు ఎందుకు ఎదురుచూడాలి? ఈ ప్రశ్న శ్రేయ నాయర్‌ను కలవరపెట్టింది. నిపుణులతో తక్షణమే కనెక్ట్ అయ్యేందుకు.. వేగవంతమైన, సరళమైన ప్లాట్‌ఫారమ్ అవసరమని ఆమె గుర్తించింది. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే జీస్పాన్ (ZSpawn). వెంటనే ఆ ఐడియాపై పని చేసింది. ప్రొఫెషనల్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఒక నెట్వర్కింగ్ యాప్ ను డిజైన్ చేసింది.
కల నెరవేరింది ఇలా..
ఆలోచన ఉన్నా దాన్ని యాప్‌గా మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ దశలో శ్రేయ నాయర్‌కు అనుభవజ్ఞుడైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ రాజేష్ వాట్కర్ మద్దతు లభించింది. శ్రేయ ఆలోచనను విన్న వెంటనే రాజేష్ వాట్కర్ దానిపై నమ్మకం ఉంచి.. ఏకంగా 9 నెలల పాటు తన టీమ్‌తో కలిసి యాప్‌ను నిర్మించారు. అంతేకాకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇందులో కీలక భాగస్వామిగా నిలిచారు. కోడింగ్ నేపథ్యం లేని వ్యవస్థాపకురాలి కల నెరవేరడంలో రాజేష్ వాట్కర్ పాత్ర ఎంతో కీలకం.
అనూహ్యమైన ఆదరణ
ZSpawn ఇంటర్‌ఫేస్ సరళంగా.. డేటింగ్ యాప్ తరహాలో ఉంటుంది. ప్రొఫైల్ చూసి స్వైప్ చేయొచ్చు. మీరు 'స్వైప్ రైట్' చేస్తే.. అవతలి వ్యక్తి కూడా స్వైప్ చేస్తే తక్షణమే చాట్ ఓపెన్ అవుతుంది. కనెక్షన్ రిక్వెస్ట్‌లు లేదా మెసేజ్‌ల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. ఈ యాప్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే భారతదేశం నుండే కాక ఐర్లాండ్, కెనడా, సింగపూర్ వంటి దేశాల నుండి కూడా వినియోగదారులను ఆకర్షించింది. నిరంతరం వస్తున్న యూజర్‌ల సంఖ్య.. ఈ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ (Professional Networking App) యొక్క ఆదరణకు నిదర్శనం. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం ఇలాంటి స్వైపింగ్ యాప్ ఇప్పటివరకూ లేదు. ఇదే మొదటి యాప్.
గ్లోబల్ విజన్: మేడ్ ఇన్ ఇండియా
17 ఏళ్లు పైబడిన విద్యార్థుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరి కోసం ZSpawn అందుబాటులో ఉంది. 1 లక్ష గ్లోబల్ యూజర్లను త్వరలో చేరుకోవాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రేయ నాయర్ దృష్టిలో ZSpawn కేవలం యాప్ కాదు. ఇదొక గ్లోబల్ టూల్. ఈ ఉత్పత్తి భారతదేశంలో నిర్మించినప్పటికీ, ప్రపంచవ్యాప్త నెట్‌వర్కింగ్ మార్గాన్ని సులభతరం చేయాలనే గొప్ప ఆకాంక్షతో ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications