Real Estate: భారతదేశంలో మెట్రో నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ అక్కడి ఇంటి అద్దెలు సైతం అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. పోనీ సొంతిల్లు కొనుక్కుందామా అంటే అది జీవితంలో నెరవేరని కలగా మారిపోయింది. ఒకపక్క కంపెనీలు పావలా, అర్థరూపాయ్ అంటూ హైక్స్, శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తుంటే దీనికి ఏమాత్రం పొంతన లేకుండా మార్కెట్లో ఇంటి అద్దె నుంచి వంటగది సరకుల వరకు రేట్లు మండిపోతున్నాయి.
ప్రస్తుతం ముంబై మహానగరంలో చాలా మంది ఉద్యోగులను పట్టిపీడిస్తోన్న సమస్య ఇంటి అద్దే. ముంబైలో ఏడాదికి సగటు 1 BHK అద్దె రూ.5.18 లక్షలుగా ఉంది. కానీ ఇక్కడ జూనియర్ లెవెల్ ఉద్యోగులకు వేతనం మాత్రం సగటున రూ.4.49 లక్షలుగా ఉంది. అంటే వారికి వచ్చే మెుత్తం అదాయం ఇంటి అద్దెకు చెల్లించినా సరే ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది. మరి ఇక రోజువారీ అవసరాల కోసం డబ్బు కావాలంటే ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితులపై CREDAI-MCHI ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ముంబై నగరంలో వేతనాలకు ఇంటి అద్దెలకు మధ్య ఉన్న వ్యత్యాసంతో చాలా మంది బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలకు మారిపోతున్నట్లు క్రెడాయ్ నివేదించింది. ఈ నగరాల్లో ఇంటి అద్దెలు ముంబై కంటే సగంలోనే ఉన్నట్లు వెల్లడైంది. కానీ ఇక్కడ కూడా అదే సమస్య ఎదురవుతోంది. ఈ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పొందుతున్న వేతనాలకు అక్కడి స్థానిక ఇంటి అద్దెలకు మధ్య కూడా భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది తమ ఆర్థిక స్థిరత్వం కోసం మెట్రో నగరాలను నుంచి వెళ్లిపోతున్నందున 'బ్రెయిన్ డ్రెయిన్' ఆందోళనలకు ఆజ్యం పోస్తోంది. అందుకే చాలా మంది ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటూ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి ముంబైలో 2 గదుల ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తులు ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీకి పనిచేస్తుంటే.. అందులో సగం ఇంటి అద్దెలకు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. ఇది బెంగళూరులో రూ.3.90 లక్షలుగా ఉండగా, దిల్లీలో రూ.3.55 లక్షలుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో 3 గదుల ఇళ్ల అద్దెను పరిశీలిస్తే.. వార్షికంగా రూ.34 లక్షలు సంపాదిస్తున్నవారు దాదాపు రూ.14 లక్షలు ముంబైలో కేవలం అద్దె కోసమే సమర్పించుకుంటున్నారు. ఇదే ఇళ్లకు బెంగళూరులో రూ.6.25 లక్షలు దిల్లీలో రూ.5.78 లక్షలు వెచ్చిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ముంబై విపరీతంగా పెరిగిన అద్దె మార్కెట్ మరింత సరసమైన ప్రత్యామ్నాయాల కోసం వృత్తినిపుణులను మరియు వారిపై ఆధారపడిన వ్యాపారాలను నగరం నుండి దూరంగా ఉంచడాన్ని కొనసాగించవచ్చని నివేదిక హెచ్చరించింది.
అయితే ఇంటి అద్దెల విషయంలో ఈ మూడు నగరాల కంటే హైదరాబాద్ కొంత మెరుగ్గా ఉంది. చాలా చోట్ల ఒక గది ఉంటున్న ఇళ్ల అద్దెలు నెలకు రూ.10-12 వేలుగా ఉండగా, రెండు గదులు ఉండే ఇళ్ల అద్దెలు దాదాపు రూ.20-25 వేల మధ్యలో ఉంటున్నాయి. అయితే ఐటీ కారిడార్ చుట్టుపక్కల మాత్రం ఇవి మరింత ఎక్కువగా ఉన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక పెరిగిన నిర్మాణ ఖర్చులను చూపిస్తూ డెవలపర్లు అపార్టుమెంట్ల ధరలను నోటికొచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి చెరువుల కబ్జాలను అరికడుతున్న వేళ అనేక అక్రమ నిర్మాణాలను నిర్థాక్షణ్యంగా కూల్చివేస్తున్న వేళ చాలా మంది ఇళ్ల కొనుగోలుకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఇది ఇళ్లను అద్దెకు ఇస్తున్న యజమానులకు పెద్ద వరంగా మారటంతో డిమాండ్ ఉందంటూ అద్దెలు డబులు చేసేస్తున్నారు. సర్కార్ భారీగా పెరుగుతున్న అద్దెలపై కూడా ఫోకస్ పెట్టాలని సగటు ఉద్యోగి ఆకాంక్షిస్తున్నాడు.


Click it and Unblock the Notifications