Hyderabad News: హైదరాబాద్ రియల్టీపై నివేదిక.. దేశంలో 2వ ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్
Real Estate News: దేశంలోని అగ్రగామి రియల్టీ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు సైతం తమ పెట్టుబడులను నగరానికి తరలిస్తున్న వేళ ఇక్కడి ప్రాపర్టీల ధరలు భారీగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
భారతదేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో ఈఎంఐ ఆదాయ నిష్పత్తి 30 శాతం వద్ద 2024 ఆర్థిక సంవత్సరంలో నిలిచింది. దేశంలోని మొదటి ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహాల మార్కెట్‌గా తొలిస్థానంలో 21 శాతం నిష్పత్తితో కొనసాగుతోంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ అఫర్డబిలిటీ సూచిక గణనీయమైన మార్పులను చూసింది. 2010లో ఈ నిష్పత్తి 47 శాతంగా ఉండేది.

గృహ కొనుగోలుదారుల డిమాండ్, విక్రయాల ఊపును నిలబెట్టడానికి స్థిరమైన అఫర్డబిలిటీ అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ఇది దేశానికి కీలకమైన ఆర్థిక చోదకంగా పని చేస్తుందని అన్నారు. ఆదాయ స్థాయిలు పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధి బలపడడం తుది వినియోగదారుల ఆర్థిక విశ్వాసం గణనీయంగా బలపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంక్ భారత జీడీపీ వృద్ధి రేటు ఆరోగ్యకరంగా 7.2 శాతం వద్ద ఉంటుందని అంచనాలతో పాటు స్థిరమైన వడ్డీ రేటు దృష్టాంతంలో, ఆదాయం అఫర్డబిలిటీ స్థాయిలు 2024లో గృహ కొనుగోలుదారుల డిమాండ్‌కు మద్దతునిస్తాయని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ రియల్లీ ధరల పెరుగుదలను గమనిస్తే.. 2010లో నగరంలో చదరపు అడుగు వెయిటెడ్ సగటు ధర రూ.2,728గా ఉందని, 2019లో రూ.4,500కి పెరిగినట్లు నివేదిక హైలైట్ చేసింది. ఇవి 2024 మొదటి అర్ధభాగం నాటికి ధరలు క్రమంగా రూ.5,681కి పెరిగినట్లు నివేదించింది.


Click it and Unblock the Notifications