Hyderabad: ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకటంతో హైదరాబాద్ బిజినెస్ డెస్టినేషన్ గా మారిపోయింది. నగరం ఎన్నడూ చూడని వేగంతో అభివృద్ధి చెందుతోంది.
ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఈవీ, టెక్స్‌టైల్, రియల్టీ రంగాల్లో కొనసాగుతున్న బూమ్ అనేక మందిని హైదరాబాదుకు రప్పిస్తోంది. ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరూ నగరంలోనే ఏదో ఒక మూలన స్థిరపడాలని, సొంతిల్లు కొనుక్కోవాలని కలలు కంటున్నారు. దీంతో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెప్టెంబర్ 2023లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ పెరిగింది.

సెప్టెంబర్ 2023లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ హైదరాబాద్ రియల్టీలో జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఈ మెుత్తం అమ్మకాల విలువ రూ.3,378 కోట్లుగా ఉంది. నివేదిక ప్రకారం సెప్టెంబర్ మాసంలో హైదరాబాద్‌లో అత్యధికంగా రూ.25-50 లక్షల మధ్య ధరల శ్రేణిలో ఉన్న ఆస్తి రిజిస్ట్రేషన్లు జోరుగా జరిగాయని వెల్లడైంది. మెుత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా దాదాపు 51 శాతంగా నిలిచింది.
ఏడాది ప్రాతిపదికన హైదరాబాద్ రియల్టీ కొనుగోళ్లు 30 శాతం వృద్ధిని నమోదు చేయగా.. గత నెలలో రిజిస్టర్డ్ ఆస్తుల విలువ 42 శాతం పెరిగింది. అమ్ముడైన ఎక్కువ ప్రాపర్టీలో 1000-2000 చదరపు అడుగుల ప్రాపర్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది.
ఏరియాల వారీగా ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ తీరును పరిశీలిస్తే.. మేడ్చల్-మల్కాజిగిరిలో 45 శాతం, రంగారెడ్డి జిల్లాలో 41 శాతం ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం రిజిస్ట్రేషన్లలో కేవలం 14 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. పెరుగుతున్న జనాభాతో పాటు నగరం విస్తరించటంతో చుట్టుపక్కల జిల్లాల్లోని బోర్డర్ ఏరియాలకు ప్రస్తుతం రియల్టీ బూమ్ పాకింది. దీంతో అక్కడి స్థలాల రేట్లకు కూడా రెక్కలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications