Hyderabad Real Estate Trend: చాలా మంది ఇప్పుడు పల్లెల నుంచి నగరబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నగరంలో ఒక సొంత ఇల్లు ఉంటే చాలనే ఆలోచన చాలామందికి వస్తోంది. అయితే తాజాగా చాలా మందికి మరో ఆలోచన కూడా కలుగుతోంది. అదేంటంటే.. నగరంలో మాత్రమే కాకుండా నగరం వెలుపల కూడా ఓ అందమైన ఇల్లు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నగర జీవితంలోని ఒత్తిడి, ట్రాఫిక్, కాలుష్యం నుంచి కొద్దిసేపైనా దూరంగా గడపాలనే కోరిక ఈ కొత్త రకం ఆలోచనకు బీజం వేస్తోంది.
ఇందులో భాగంగానే చాలామంది 200 నుంచి 1,000 గజాల లోపు స్థలాలను కొనుగోలు చేసి ఓ చిన్న ఇల్లును వీకెండ్ హోమ్ మాదిరిగా నిర్మించుకుంటున్నారు. ఇంకాస్త డబ్బున్నోళ్లు అయితే వెయ్యి నుంచి నాలుగు వేల గజాలు, రెండు నుంచి మూడు ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసి విల్లాలాగానో, లేక ఫామ్ హౌస్ లాగానో లేక వ్యవసాయ క్షేత్రాలుగానో మలుచుకుంటున్నారు. వాటిని వీకెండ్ హోమ్స్ గా మార్చుకుని వారాంతంలో కుటుంబంతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.
ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న భూముల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో బంగ్లా తరహా ఇళ్లను నిర్మిస్తున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కారులో బయల్దేరి ఈ ఇళ్లకు వెళ్లి కాలుష్యానికి దూరంగా ప్రకృతితో మమేకమవుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.విదేశాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి వారు ఈ వీకెండ్ హోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక నగరంలో రెండో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే పెట్టుబడిదారులు కూడా ఈ సెగ్మెంట్‌పై ఆసక్తి చూపుతున్నారు.
పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే ప్రాజెక్టుల వైపు వీరి దృష్టి ఉంది. దీర్ఘకాలం గడిపేందుకు అనుకూలంగా ఉండేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లు కూడా వాటిని నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, యువతను ఆకర్షించేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు.

అలాగే వీటిని నిర్వహించడంలో ఇబ్బందులు రాకుండా హౌస్‌కీపింగ్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ సేవలను డెవలపర్లే అందిస్తున్నారు. కస్టమర్లు ఉపయోగించని సమయంలో ఈ ఇళ్లను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఫ్యామిలీ గెటవేలకు ఉపయోగించి వచ్చే లాభాల్లో యజమానులకు వాటా ఇస్తున్నారు.
ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు ఏరయాలైన శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, శ్రీశైలం రోడ్డు మార్గం, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్‌పల్లి, షాద్‌నగర్, కడ్తాల్, తలకొండపల్లి వంటి ప్రాంతాల్లో ఈ వీకెండ్ హోమ్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఏరియాలో ఎకరాల భూమి కాకుండా కొద్ది స్థలంలోనే వీకెండ్ హోమ్స్ నిర్మిస్తున్నారు. పర్యావరణహితమైన నిర్మాణ సామగ్రి, మట్టి ఇటుకలు, కలప, వర్షపు నీటి సేకరణ, పచ్చదనం, కూరగాయల తోటలు వంటి వాటితో కాలుష్యాన్ని పారదోలుతున్నారు. ఏదేమైనా ప్రకృతికి హాని కలగకుండా, వ్యవసాయం చేసిన తృప్తితో జీవించాలనుకునే వారికి వీకెండ్ హోమ్స్ కొత్త జీవనశైలిగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications