హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్.. ఒకప్పుడు ప్రధాన నగరాలకు సవాల్ విసిరి ఇప్పుడు మాత్రం..
భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మందగమనాన్ని చేస్తోంది. ప్రత్యేకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే.. ఒకప్పుడు దేశంలోని మిగతా నగరాలకు సవాల్ విసిరిన ఈ మార్కెట్ కూడా ఇప్పుడు నెమ్మదించినట్లు కనిపిస్తోంది.అనరాక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జూలై నుండి సెప్టెంబర్ మధ్య జరిగిన ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే తగ్గిపోయాయి.
గణాంకాలను చూస్తే గత ఏడాది ఇదే సమయంలో 1,07,060 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య 97,080 యూనిట్లకు పరిమితమైంది. అంటే 9 శాతం వరకు పతనం చోటు చేసుకుంది. చెన్నై, కోల్‌కతా మినహా మిగతా ఐదు నగరాల్లో అమ్మకాల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నైలో మాత్రం గతేడాది 4,510 యూనిట్ల నుంచి ఈ ఏడాది 6,010 యూనిట్లకు చేరుకోవడం 33 శాతం వృద్ధిని సూచిస్తోంది. కోల్‌కతాలోనూ 3,980 యూనిట్ల నుంచి 4,130 యూనిట్లకు చేరి 4 శాతం పెరుగుదల కనిపించింది. కానీ హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె, బెంగళూరు నగరాల్లో మాత్రం విక్రయాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..గత ప్రభుత్వం ఐటీ, ఫార్మా, ఏవియేషన్ వంటి కీలక రంగాలను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు అనేక రకాల సబ్సిడీలు, సౌకర్యాలు కల్పించడం వల్ల నిర్మాణ రంగం పుంజుకుంది.కొత్త ఉద్యోగ అవకాశాలు అధికమవడంతో ఇండ్ల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 2014 తర్వాత దాదాపు పదేండ్లపాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు అదే ఉత్సాహం కనిపించినా Hyderabad real estate లో అంతగా ఊపు కనపడటం లేదు. దేశంలోని ఇతర నగరాల తరహాలో ఇక్కడ కూడా మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే ఊరట కలిగించే అంశం ఏంటంటే.. నగరంలో యూనిట్ల పరంగా విక్రయాలు తగ్గినా, విలువపరంగా మాత్రం పెరుగుదల ఉంది.
అనరాక్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో గృహ విక్రయాల విలువ 14 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో రూ.1.33 లక్షల కోట్ల విలువగల సేల్స్ నమోదు కాగా, ఈసారి అది రూ.1.52 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంటి ధరలు పెరగడం, ముఖ్యంగా లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి పేర్కొన్నారు. మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన కొనుగోలుదారులు వెనక్కి తగ్గినా, అధిక ఆదాయం కలిగిన వర్గాలు మాత్రం ఖరీదైన ఇండ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఒకవైపు సాధారణ మార్కెట్ మందగమనాన్ని ఎదుర్కొంటుండగా, మరోవైపు ప్రీమియం సెగ్మెంట్ మాత్రం రాణిస్తోంది. అంటే, రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో అసమానతలు పెరగవచ్చు. కొనుగోలుదారుల శక్తి, ఆర్థిక స్థితి ఆధారంగా మార్కెట్ వేర్వేరు దిశల్లో సాగుతుందనే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications