హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక దశగా.. సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు రహదారుల విస్తరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) విస్తృత కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగర విస్తరణ, ట్రాఫిక్ భారం తగ్గింపు, భవిష్యత్ పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ORR-RRR మధ్య మొత్తం 16 గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి HMDA ప్రతిపాదనలు రూపొందించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రెండు కీలక గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు సుమారు 41 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మొదటి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే విధంగా బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం త్వరలోనే డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయనున్నట్లు HMDA అధికారులు వెల్లడించారు.

ఈ రహదారులు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ORR మీదుగా నేరుగా RRR వరకు చేరుకునేలా రూపకల్పన చేయనున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ కొత్త అర్బన్ కారిడార్లు ఏర్పడటంతో పాటు, ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్-2047 నివేదికలో కూడా నగర విస్తరణకు అనుగుణంగా దశలవారీ రహదారి అభివృద్ధి కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ORR నుంచి RRR మధ్య భారీ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కూడా HMDA ప్రణాళికలో భాగమే. 2047 నాటికి రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు గృహవసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ 167వ జాతీయ రహదారికి కలుపుతుంది. బుద్వేల్ నుంచి చందన్‌వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రం వరకు ఈ రహదారి విస్తరిస్తుంది. మొత్తం 81 కిలోమీటర్లలో సుమారు 52 కిలోమీటర్లు HMDA పరిధిలో ఉంటాయి.
ఇటీవల Hyderabad విస్తీర్ణాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం పెంచడంతో HMDA కార్యకలాపాలు 11 జిల్లాలకు విస్తరించాయి. దీనికి అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధి, లాజిస్టిక్ హబ్స్, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. సమగ్ర మాస్టర్‌ప్లాన్-2050లో భాగంగా ఆర్థికాభివృద్ధి, పట్టణ ప్రజారవాణా, జలవనరులు, అటవీ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి.
అయితే.. రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రైతులు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌కు తుది రూపం ఇవ్వనున్నట్లు HMDA ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications