హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఏరియాలో ఇల్లు కొనేముందు జాగ్రత్త.. దాదాపు 300 ఆస్తులు Prohibited Listలోకి..
Hyderabad Real Estate: గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలు, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం విడుదల చేసిన నిషేధిత ఆస్తుల జాబితా (సెక్షన్ 22-ఏ) చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. సాధారణ, మధ్యతరగతి ప్రాంతాలకే పరిమితమనుకున్న ఈ సమస్య.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదుగా మారిన విఐపి ప్రాంతమైన జూబ్లీహిల్స్‌నూ చుట్టుముట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాసం ఉన్న రోడ్ నంబర్ 44 తో సహా జూబ్లీహిల్స్‌లోని వందలాది విలువైన ఆస్తులు.. సీలింగ్ భూములంటూ 22-ఏ నిషేధిత జాబితాలో చేరడం రియల్ ఎస్టేట్, ఆస్తి యజమానుల వర్గాల్లో కలకలం రేపుతోంది.
TOI కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (JHCHBS) పరిధిలోని పలు ఆస్తులు తీవ్రమైన 22-ఏ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సొసైటీ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం నివాసానికి దగ్గరగా ఉన్న రోడ్ నెం. 36 సమీపంలో నివసించే ఒక బాధితుడు తన ఆస్తిని విక్రయించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా.. సర్వే నంబర్లు 403/1, 120 మరియు 102/1 సీలింగ్ భూములుగా ఉన్నందున ఆ ఆస్తి 22-ఏ జాబితాలోకి వస్తుందని అధికారులు లావాదేవీలను నిలిపివేశారు. బంజారాహిల్స్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందించే నిరభ్యంతర పత్రం (NOC) సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని సూచిస్తుండటంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో హైదరాబాద్ జిల్లాకు చెందిన నిషేధిత ఆస్తుల వివరాలను అందుబాటులో ఉంచలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలన్నీ సవరించిన 22-ఏ జాబితాలను ఇప్పటికే పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగా.. హైదరాబాద్ జిల్లా మాత్రం ఎలాంటి సవరించిన జాబితాను ఆన్‌లైన్ చేయలేదు. బాధితులు నేరుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను (SRO) సంప్రదించినప్పుడు పొందే మార్కెట్ విలువ నివేదికల ఆధారంగానే తమ ఆస్తి నిషేధంలో ఉందనే విషయం తెలుస్తోంది.
గతంలో జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి ప్రభుత్వం 1,398 ఎకరాల భూమిని కేటాయించగా.. అందులో షేక్‌పేట్, హకీంపేట్ గ్రామాల పరిధిలోని 403/A, 120, 102/1 సర్వే నంబర్లలో 1,100 ఎకరాల్లో 3,035 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సొసైటీలో సుమారు 5 వేల మంది సభ్యులు ఉన్నారు.
సొసైటీ నిబంధనల ప్రకారం సభ్యులకు 1,200 నుండి 1,500 చదరపు గజాల ప్లాట్లు కేటాయించారు. అయితే 2008లో పట్టణ భూమి గరిష్ట పరిమితి చట్టం (ULC) రద్దు కావడానికి ముందు ఉన్న నిబంధనల ప్రకారం 1,200 చదరపు గజాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండటానికి అవకాశం లేకపోవడంతో.. పొరుగు ప్లాట్లను కొనుగోలు చేసి 2,500 చదరపు గజాలకు పైగా పొడిగించుకున్న యజమానులు ఇప్పుడు ఈ 22-ఏ చిక్కుల్లో పడ్డారు. అలాగే అసలు కేటాయింపుకు అదనపు భూమిని జోడించి.. సొసైటీకి రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకున్న ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి. జూబ్లీహిల్స్ లోని మొత్తం ప్లాట్లలో దాదాపు 10 శాతం, అంటే సుమారు 300 ప్లాట్లు ఈ సమస్యతో నలిగిపోతున్నాయి.
ఈ అంశంపై షేక్‌పేట్ తహసీల్దార్ వై. అనితా రెడ్డి స్పందిస్తూ.. జూబ్లీహిల్స్‌లోని కొన్ని సర్వే నంబర్లతో పాటు షేక్‌పేట్ మండలంలోని ఇతర ప్రాంతాల భూములపై ప్రభుత్వానికి హక్కులు ఉన్నందున అవి ప్రస్తుతం నిషేధంలో ఉన్నాయని అంగీకరించారు. అయితే, ప్రస్తుతం 22-ఏ జాబితా సవరణ ప్రక్రియలో ఉందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోవడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను కలిసి తమ ఆస్తులను నిషేధిత జాబితా నుండి వెంటనే తొలగించాలని జూబ్లీహిల్స్ నివాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
