Hyderabad Real Estate: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మరోసారి ప్రభుత్వ భూముల్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గతంలో ఉప్పల్, కోకాపేట్, బుద్వేల్ వంటి చోట్ల నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లకు విశేష స్పందన లభించిన సంగతి విదితమే. ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు HMDA సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ-వేలం కోసం ఇప్పటికే HMDA నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే.. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ లేఅవుట్‌లో మొత్తం 12 ప్లాట్లు వేలానికి రానున్నాయి.అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు అమ్మకానికి రానున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 4 ప్లాట్లు వేలానికి అందుబాటులో ఉండగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మరో 7 ప్లాట్లు వేలానికి ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది.
ఈ వేలం తేదీలను కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. తుర్కయాంజాల్ లేఅవుట్‌లో సెప్టెంబర్ 16, బాచుపల్లి లేఅవుట్‌లో సెప్టెంబర్ 17, ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్ 18న వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.వేలం రిజిస్ట్రేషన్ కోసం కూడా అదే తేదీలను చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. ఈ దశ పూర్తయిన తర్వాత మరో 11 ప్రాంతాల్లో ఉన్న సమగ్ర స్థలాలను దశల వారీగా వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం రాబట్టడంతో పాటు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశాలు లభించే అవకాశముంది. ఇప్పటికే తుర్కయంజాల్, బాచుపల్లి లాంటి ప్రాంతాల్లో లే-అవుట్, సర్వే పనులు పూర్తయ్యాయి. అయితే వేలం మొదలుపెట్టేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉండటంతో అధికారులు ఇప్పటిదాకా వేచి చూశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడంతో HMDA నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిని బట్టి చూస్తే.. భూములు అమ్మకానికి బెస్ట్ టైమ్‌గా భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన రావడంతో, HMDA ప్లాట్లకు కూడా విశేష స్పందన ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట్, బుద్వేల్ లాంటి ప్రాంతాల్లోని ప్లాట్లు నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేట్లకు అమ్ముడయ్యాయి. ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో ధరలు భారీగా దూసుకుపోయాయి. ఈసారి కూడా అదే ఊపు ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి HMDA సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 11 ప్రాంతాల్లో భూములను దశల వారిగా బిడ్డింగ్‌కు పెడతారు. వాటిలో ముఖ్యమైనవి:
బైరామల్‌గూడ (2420 గజాలు)
కోకాపేట్ (8591 గజాలు)
చందానగర్ (484 గజాలు)
పుప్పాలగూడ (1400 గజాలు)
బాచుపల్లి (2299 గజాలు)
బౌరంపేట్ (మూడు భాగాలుగా - 2420, 1500, 666 గజాలు)
చెంగిచెర్ల (1210 గజాలు)
సూరారం (4840 గజాలు)
ఈ భూములను HMDA ఒకేసారి కాకుండా దశల వారీగా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వేలం వేయనుంది. మొదటి దశ పూర్తయిన వెంటనే రెండో దశ తేదీలను ప్రకటిస్తారు.మొదటి విడతగా 82 ప్లాట్లు, ఆ తర్వాత మరో 11 ప్రాంతాల్లో వేలం వేయనున్నారు.
అధికార వర్గాల అంచనా ప్రకారం.. తొలి దశలో వేలానికి పెట్టబోయే స్థలాలకు చదరపు గజానికి సగటు రూ.30 వేల నుంచి నుంచి రూ.35 వేల వరకు ప్రారంభ ధరగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక కోకాపేట్, పుప్పాలగూడ లాంటి హై-డిమాండ్ ప్రాంతాల్లో ధరలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. దీనికి కారణం ఈ ప్రాంతాల్లో గతంలో జరిగిన వేలం పాటలే అని చెప్పుకోవచ్చు.
కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది జరిగిన వేలంలో ఒక చదరపు గజానికి ఏకంగా లక్ష రూపాయల ధర పలికింది. మొత్తం ఎకరా భూమికి రూ.100 కోట్లకు పైగా ధర పలికింది. ఈ దృష్ట్యా, ప్రస్తుతం HMDA వేలం వేయనున్న కోకాపేట్ సర్వే నంబర్ 144లోని 8,591 చదరపు గజాల స్థలం, సర్వే నంబర్ 146లోని 1,400 చదరపు గజాల స్థలంపై కూడా భారీ ఆసక్తి ఉందని భావిస్తున్నారు. గతంలో హౌసింగ్ బోర్డు స్థలాలకు జరిగిన ఆన్‌లైన్ బిడ్డింగ్ కీ, తాజాగా తోర్రూరు ఈ-వేలానికి కూడా అనూహ్య స్పందన లభించింది.కొన్ని ప్లాట్లు అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ ధరలకు కూడా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా కార్నర్ ప్లాట్‌లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనించదగిన విషయంగా చెప్పుకోవచ్చు.
ఈసారి HMDA కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. కారణం ఏంటంటే.. వేలం పెట్టబోయే కొన్ని భూములపై అక్రమ ఆక్రమణలు, నకిలీ పత్రాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో భూములు స్థానిక అధికారుల నియంత్రణలో ఉండగా, కొంతమంది నకిలీ డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. అందుకే ఈసారి పరిపూర్ణ పారదర్శకత కోసం HMDA అన్ని వేలాలను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలొ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications