Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విచిత్రమైన ట్రెండ్ కొనసాగుతోంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న తక్కువ బడ్జెట్ ఇళ్లకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. దాని స్థానాన్ని ఇప్పుడు లగ్జరీ ఫ్లాట్లు ఆక్రమించాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వినియోగదారులు ఇప్పుడు విలాసవంతమైన, అధిక ధర గల ఫ్లాట్లనే కొనుగోలు చేస్తున్నారు. నగరంలో తక్కువ బడ్జెట్ ఇళ్లకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం నగరంలో రూ. 1.5 కోట్లకు పైబడిన ఫ్లాట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
క్రెడాయ్ (CREDAI), సీఆర్ఈ మ్యాట్రిక్స్ (CRE Matrix) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024 మొదటి ఆరు నెలలతో పోలిస్తే.. 2025 మొదటి ఆరు నెలల్లో హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అధిక విలువ గల ఫ్లాట్ల వాటా విపరీతంగా పెరిగిందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే.. రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ధర గల ఫ్లాట్ల రాబడి వాటా 2024లో 28 శాతం ఉండగా, 2025లో అది 34 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో రూ. 3 కోట్లకు పైబడిన ఫ్లాట్లు తమ 35 శాతం రాబడి వాటాను నిలబెట్టుకుని అగ్రస్థానంలో కొనసాగాయి. ఇది స్పష్టంగా హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్ లగ్జరీ వైపు వెళుతుందని చూపిస్తోంది.

నగరంలో రూ. 70 లక్షల లోపు ధర గల బడ్జెట్ ఫ్లాట్ల మార్కెట్ పెద్దగా దెబ్బతింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ విభాగం రాబడి వాటా 7 శాతం ఉండగా.. ఈ ఏడాది అది కేవలం 3 శాతానికి పడిపోయింది. రూ. 70 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ధర గల ఫ్లాట్ల వాటా కూడా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు నగరంలో సుమారు 30 వేల ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం తక్కువ. హైదరాబాద్ నగరంలో అమ్మకాల సంఖ్య తగ్గినా.. అధిక ధర గల ఫ్లాట్ల డిమాండ్ పెరగడంతో మొత్తం విక్రయాల విలువలో 2 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.
నగరంలో ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సెక్టార్‌లలో ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు, బహుళజాతి కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు లాంటి వర్గాలు అధిక సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ టవర్లు, ప్రీమియం లొకేషన్లలో ఫ్లాట్లపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అంతర్జాతీయ డిజైన్, స్మార్ట్ హోమ్ ఫీచర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, 24/7 సెక్యూరిటీ వంటి విలాస సదుపాయాలు లగ్జరీ హౌసింగ్‌కు ప్రధాన ఆకర్షణలు మారుతున్నానయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.
ఇక నిర్మాణ వ్యయాల పెరుగుదల, భూముల ధరల పెరగడం, హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ల మార్పులు బడ్జెట్ సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో హైదరాబాదు రియల్ ఎస్టేట్‌లో వాల్యూమ్ కన్నా వాల్యూ ఎక్కువ పాపులర్ అవుతోంది. రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం.. 2025 ద్వితీయార్ధంలో కూడా ఈ లగ్జరీ ట్రెండ్ కొనసాగవచ్చని..కోకాపేట్, గచ్చిబౌలి, నార్సింగి, నానకరామ్‌గూడ, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో అధిక విలువ గల ప్రాజెక్టులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరంలో బడ్జెట్ హౌసింగ్ తిరిగి మళ్లీ ఊపందుకోవాలంటే.. ప్రభుత్వం, డెవలపర్లు చౌక ధరల గృహ ప్రాజెక్టులపై తమ దృష్టిని నిలపాలని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications