హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని పోలీసులు ఆదేశాలు
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే హైదరాబాద్ నగరంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైడ్రా తెలిపింది. ముఖ్యంగా రాత్రిపూట భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడవచ్చని ఉద్యోగులు అలర్ట్ గా ఉండాలని కోరింది. ఆఫీసుల నుంచి ముందుగానే నిష్క్రమించాలని, WFH కోసం దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
ప్రజలు తమ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని.. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. సహాయం కోసం HYDRAA హెల్ప్‌లైన్‌ను 040 29560521, 9000113667, లేదా 9154170992 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్‌లో గత వారం నుంచి కురుస్తున్నభారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్కూళ్లు, కళాశాలలకు వెళ్తున్న ప్రజలు ప్రతి రోజు ప్రయాణాన్ని నరకయాతనగా అనుభవిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు హిమాయత్ సాగర్ జలాశయానికి వరదనీటిని పోటెత్తిస్తున్నాయి. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు ఇటీవల నాలుగు గేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. దీనితో మూసీ నది ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతోంది.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు, గ్రామాలు వరద ముప్పుకు గురవుతున్నాయి. నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ అక్కడి ప్రజలు భయాందోళనల్లో మగ్గుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Click it and Unblock the Notifications