హైదరాబాద్ (Hyderabad) నగర ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల రక్షణ కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయడం మనకు తెలుసు. కానీ, ఇప్పుడు చలాన్లకు బదులు 'హెల్మెట్' ఇచ్చి పంపించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ఈ 'హెల్మెట్ బ్యాంక్' కాన్సెప్ట్ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ అయింది.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం జరిమానాలు వేయడం వల్ల మార్పు రావడం లేదని గుర్తించిన మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు.. ప్రజల్లో బాధ్యతను పెంచేందుకు 'హెల్మెట్ బ్యాంక్' (Helmet Bank) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంగీత్ జంక్షన్‌లో శ్రీకారం
మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి ఈ సరికొత్త విధానాన్ని సికింద్రాబాద్‌లోని సంగీత్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేకుండా దొరికిపోయిన వారికి వెంటనే ఫైన్ వేయకుండా, పోలీసులే వారికి ఒక హెల్మెట్ ఇస్తారు. అయితే ఇది గిఫ్ట్ కాదు. కేవలం 'అప్పు' (Loan) మాత్రమే.
హెల్మెట్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది?
ఎవరైనా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే.. పోలీసులు వారి వివరాలు (ఆధార్ లేదా ఫోన్ నెంబర్) తీసుకుని తమ బ్యాంక్ నుంచి ఒక హెల్మెట్ ఇస్తారు. ఆ వాహనదారుడు ఆ హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా వెళ్లవచ్చు. అయితే వారు 24 గంటల లోపు తమ స్వంత హెల్మెట్ కొనుగోలు చేసి, పోలీసులు ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి ఇచ్చేయాలి. ఇది కేవలం రైడర్లలో హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నం.
శిక్ష కంటే రక్షణే ప్రధానం
"మా ఉద్దేశం చలాన్లు వసూలు చేయడం కాదు, ప్రజల ప్రాణాలను కాపాడటం. హెల్మెట్ అనేది ఒక రూల్ కాదు, అది మీ ప్రాణానికి శ్రీరామరక్ష" అని డీసీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ సౌకర్యాన్ని పదేపదే దుర్వినియోగం చేసేవారిపై,హెల్మెట్ తిరిగి ఇవ్వని వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
త్వరలో సిటీ మొత్తం విస్తరణ
ప్రస్తుతం మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో మొదలైన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టును త్వరలోనే బేగంపేట వంటి రద్దీ ప్రాంతాలకు, ఆ తర్వాత హైదరాబాద్ నగరం అంతటా విస్తరించాలని పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ ధరించడం అనేది కేవలం పోలీసుల కోసం కాకుండా, మీ కుటుంబం కోసం అని గుర్తించాలని వారు కోరుతున్నారు.
మొత్తానికి హైదరాబాద్ పోలీసుల ఈ మానవీయ కోణం అందరినీ ఆకట్టుకుంటోంది. చలాన్ల భయం కన్నా, రక్షణ పట్ల బాధ్యత పెరిగినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications