అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్స్, మెసేజెస్, మెయిల్స్ ద్వారా ఇప్పటివరకు నగదు తస్కరించడం రోజూ వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్ లో తాజాగా ఓ కొత్త తరహా మోసం బయటకు వచ్చింది. ఈ ముఠా ఏకంగా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించడం విశేషం.
హైదరాబాద్ లో ఓ ఘరానా మోసాన్ని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ, ఓ ముఠా నగరంలో ఫేక్ కాల్ సెంటర్ నడిపిస్తోంది. ఈ అంతర్జాతీయ కాల్ సెంటర్ ద్వారా అమెరికా పౌరులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 115 మంది సైబర్ నేరగాళ్లు ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు తెలిపారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాల్స్ ద్వారా అమెరికన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఈ స్కామ్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఆన్ లైన్ పోర్టల్స్ నుంచి అమాయకులు ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి మోసాలకు పాల్పడినట్లు వివరించారు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం.. కాల్ సెంటర్ సిబ్బంది VoIPని ఉపయోగించి అమెరికన్లకు కాల్స్ చేసేవారు. వారికి సంబంధించిన ప్యాకేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు భయపెట్టేవారు. US కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని బెదిరించేవారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే గిఫ్ట్ కార్డుల ద్వారా నగదు చెల్లించాలని చెప్పేవారు.
గిఫ్ట్ కార్డులను ఇండియాలో రిడీమ్ చేసి, ఆ అమౌంట్ ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలకు బదిలీ చేసేవారు. అనంతరం లోకల్ బిట్ కాయిన్ డీలర్స్ కు విక్రయించి నిధులను తమ ఖాతాకు బదిలీ చేసుకునేవారు. ఈ చెల్లింపులన్నీ US డాలర్స్ లో జరగడంతో స్కామ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు నిందితుల పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications