Hyderabad Realty: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంది. ఆయా ప్రముఖ నగరాలు, పట్టణాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మెట్రో సిటీల్లో అయితే కోట్లు పెట్టినా జాగా దొరికే పరిస్థితి లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల ఎకరం 100 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. దీంతో భాగ్యనగరంలో రియల్ బూమ్ ఏ స్థాయిలో ఉందో యావత్ దేశానికి అర్ధమైంది.
గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పుడు విలాసవంతమైన, ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 2023లో 5 వేల 725 ఆస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. ఒక్క ఫిబ్రవరి, 2024లోనే 6 వేల 938 చేతులు మారాయి. అంటే 21 శాతం భారీ పెరుగుదల నమోదైంది. వీటి విలువ దాదాపు 4 వేల 247 కోట్లుగా తేలింది. ఏడాది క్రితం 2 వేల 987 కోట్లతో పోలిస్తే ఇది 42 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

భాగ్యనగరం రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలు అంతర్భాగంగా ఉన్నాయి. గత నెల హైదరాబాద్‌లో అమ్ముడైన ఆస్తుల్లో 25-50 లక్షల శ్రేణి ప్రోపర్టీస్ వాటా 45 శాతంగా ఉంది. ఇక్కడ రిజిస్టర్ కాబడిన ఆస్తుల కేటగిరిలో ఇదే అతి పెద్దదిగా నిలిచింది. 25 లక్షల కంటే తక్కువ వాల్యూ రిజిస్ట్రేషన్స్ 14 శాతం, కోటి పైగా విలువైనవి 10 శాతం చొప్పున నమోదయ్యాయి.
రిజిస్టర్ కాబడిన చాలా ఆస్తులు వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఫిబ్రవరి 2023తో పోలిస్తే చిన్న గృహాలకు డిమాండ్ 20 నుంచి 16 శాతానికి పడిపోయింది. ఈ మొత్తం డేటా ప్రకారం చూస్తే హైదరాబాద్‌లో ప్రీమియం గృహాలకు డిమాండ్ బాగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా MD శిశిర్ బైజల్ తెలిపారు. కోవిడ్ అనంతరం ధరలు స్థిరంగా పెరిగినట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications