Hyderabad: లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా! రూ. 10 కోట్లు పెడితే ఎంత పెద్ద ఇల్లు వస్తుందో తెలుసా?
దక్షిణ భారతదేశంలో లగ్జరీ ఇళ్ల మార్కెట్ అనగానే అందరికీ బెంగళూరు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు సౌత్ ఇండియాలోనే 'అల్ట్రా లగ్జరీ' హౌసింగ్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచింది. ఇక్కడి అమ్మకాల జోరు చూస్తుంటే టెక్ సిటీ బెంగళూరు కూడా వెనుకబడిపోయింది. ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియల్టీ , CRE మేట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అక్షరాలా రూ. 8,562 కోట్ల అమ్మకాలు!
గత ఆర్థిక ఏడాది (FY26) గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల విక్రయాలు భారీగా జరిగాయి. వీటి మొత్తం విలువ రూ. 8,562 కోట్లు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన అమ్మకాలు కేవలం రూ. 1,957 కోట్లు మాత్రమే. అంటే బెంగళూరు కంటే హైదరాబాద్ దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. చెన్నై నగరం రూ. 727 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
కోకాపేట.. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం కొత్తగా ఏర్పడిన 'లగ్జరీ కారిడార్స్'. ముఖ్యంగా కోకాపేట ప్రాంతం ఇప్పుడు కోటీశ్వరుల హాట్ స్పాట్ గా మారింది. కేవలం కోకాపేటలోనే రూ. 1,298 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. గత నాలుగేళ్లలో హైదరాబాద్ (Hyderabad) లగ్జరీ మార్కెట్ 3.5 రెట్లు పెరగడం గమనార్హం.
ఇక్కడి ఇళ్లు ఎందుకు కొంటున్నారు?
హైదరాబాద్‌లో ఇల్లు కొనడానికి ఇన్వెస్టర్లు మక్కువ చూపడానికి ఒక బలమైన కారణం ఉంది. అదే 'వాల్యూ-ఫర్-స్పేస్'.
- విశాలమైన ఇళ్లు: ఇక్కడ జరిగిన విక్రయాల్లో 57 శాతం ఇళ్లు 8,000 చదరపు అడుగుల కంటే పెద్దవి.
- పెద్ద విల్లాలు: మొత్తం సేల్స్ లో 40 శాతం వాటా విల్లాలు , రో-హౌస్‌లదే.
- ధర - స్థలం: రూ. 10 కోట్లు పెడితే బెంగళూరు లేదా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా పెద్ద ఇల్లు వస్తుంది. అందుకే ధనవంతులు ఇక్కడే పెట్టుబడి పెడుతున్నారు.
బెంగళూరు , చెన్నై పరిస్థితి ఏంటి?
బెంగళూరులో (Bengaluru) అమ్మకాల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ (Year-on-Year 52% వృద్ధి), మొత్తం విలువ పరంగా హైదరాబాద్‌ను అందుకోలేకపోయింది. అక్కడ రాజనుకుంటే వంటి కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక చెన్నై మార్కెట్ మాత్రం చాలా నెమ్మదిగా, కేవలం సంప్రదాయంగా ఉన్న కొన్ని ధనిక వర్గాలకే పరిమితమైంది.
మొత్తానికి, పెద్ద ఇళ్లు, విశాలమైన విల్లాలు , అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతోంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ మరిన్ని లగ్జరీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications