భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి రవాణా వ్యవస్థకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్డు (ORR) తో ట్రాఫిక్ కష్టాలు తీరగా.. ఇప్పుడు అదే మార్గంలో హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలును కూడా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటనతో ఈ 'మహా మెట్రో' ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏమిటీ ఈ 'మహా మెట్రో' రింగ్ రైల్?
నగరం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉందో.. అదే తరహాలో సిటీ చుట్టూ మెట్రో కూడా నిర్మించబోతున్నారు. హైదరాబాద్ సిటీ 360 డిగ్రీల కోణంలో విస్తరిస్తున్న తరుణంలో కోర్ అర్బన్ ప్రాంతాన్ని కలుపుతూ 158 కిలోమీటర్ల పొడవునా వలయాకారంలో ఈ మెట్రోను నిర్మించనున్నారు. దీనివల్ల నగర శివారు ప్రాంతాల నుంచి సిటీ లోపలికి వచ్చే ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రాజెక్ట్ హైలైట్స్..
- మొత్తం పొడవు: 158 కిలోమీటర్లు (ORR వెంట).
- స్టేషన్ల సంఖ్య: ప్రస్తుతం ఉన్న 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్ల ఏర్పాటు.
- కనెక్టివిటీ: జాతీయ రహదారులు, ప్రాంతీయ రింగ్ రోడ్డుతో అనుసంధానం.
భూసేకరణ ఇబ్బందులు లేవు!
ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ భూసేకరణ. గతంలో ఓఆర్‌ఆర్ నిర్మించినప్పుడే సర్వీస్ రోడ్డు పక్కన భవిష్యత్తు అవసరాల కోసం (రీజినల్ రింగ్ రైల్ లేదా మెట్రో కోసం) సుమారు 25 మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం వదిలేసింది. దీనివల్ల కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత వేగంగా డీపీఆర్ (DPR) సిద్ధం చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద స్టేషన్లు
ప్రస్తుతం ORR కి ఉన్న 22 ప్రధాన ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్లను ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీటిని 25 వరకు పెంచే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ వాహనాలను ఇక్కడే పార్క్ చేసి మెట్రో ఎక్కేలా భారీ 'మల్టీ లెవల్ పార్కింగ్' సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే ఇంటర్‌ఛేంజ్ ల నుంచి మెట్రో స్టేషన్లకు చేరుకోవడానికి ప్రత్యేక 'స్కైవాక్' లను కూడా నిర్మించబోతున్నారు.
హైదరాబాద్‌కు కలిగే ప్రయోజనాలు..
- ట్రాఫిక్ నియంత్రణ: జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నగరం బయటే నియంత్రించి, ప్రజలు మెట్రోలో సిటీలోకి వచ్చేలా చేయవచ్చు.
- కాలుష్య నివారణ: వేలాది వాహనాలు రోడ్లపైకి రాకపోవడం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.
- రియల్ ఎస్టేట్ బూమ్: మెట్రో కనెక్టివిటీ వల్ల ORR పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు ఐటీ, వాణిజ్య రంగాలు మరింత విస్తరిస్తాయి.
- ఉపాధి అవకాశాలు: మెట్రో రైలు రాకతో శివారు ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు, కార్యాలయాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.
ఏది ఏమైనా ఈ రింగ్ మెట్రో ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ (Hyderabad) నగరం ప్రపంచంలోని అత్యుత్తమ రవాణా సౌకర్యాలున్న మెట్రోపాలిటన్ నగరాల సరసన చేరడం ఖాయం. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా సిటీకి మరింత డిమాండ్ పెరగడమే కాకుండా.. సిటీ డెవలప్ మెంట్ కూడా మెట్రో రైల్ రింగ్ వరకూ విస్తరిస్తుంది.


Click it and Unblock the Notifications