హైదరాబాద్ మెట్రోకు మూడు జాతీయ అవార్డులు, దేశంలో అగ్రగామి PPP ప్రాజెక్ట్‌గా గుర్తింపు
హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించింది. ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) సెప్టెంబర్ 2025లో వరుసగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. తద్వారా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ కింద దేశంలోనే అత్యంత విజయవంతమైన మెట్రో ప్రాజెక్ట్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
సెప్టెంబర్ 19న న్యూఢిల్లీలో జరిగిన ET Now Infra Focus Summit 2025 లో.. L&TMRHL మేనేజింగ్ డైరెక్టర్, CEO కేవీబీ రెడ్డి Editorial Choice Award - PPP Project of the Yearను స్వీకరించారు. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా అందజేశారు. దీనితో హైదరాబాద్ మెట్రో..భారతదేశంలోని అత్యుత్తమ PPP ప్రాజెక్ట్‌గా, అలాగే మెట్రో రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

తదుపరి రోజు, సెప్టెంబర్ 18న, L&TMRHL మరో గొప్ప గౌరవాన్ని అందుకుంది. CII 26వ జాతీయ ఇంధన నిర్వహణ అవార్డులో అత్యుత్తమ పనితీరు చూపినందుకు దేశంలో మొట్టమొదటి మెట్రో ఆపరేటర్‌గా గుర్తింపు పొందింది. ఇది హైదరాబాద్ మెట్రో అమలు చేస్తున్న ఇంధన సామర్థ్యం, పర్యావరణహిత విధానాల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు CII 53వ నేషనల్ కైజెన్ కాంపిటీషన్ 2025లో కూడా రింగ్ మెయిన్ పవర్ సప్లై సిస్టమ్ విత్ ఇంటెలిజెంట్ GIS ప్యానెల్ రీడిస్ట్రిబ్యూషన్ అనే సాంకేతిక పరిష్కారం కోసం ప్లాటినం అవార్డు దక్కింది. ఇది మెట్రోలో అమలవుతున్న ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
ఈ అవార్డులు మా సంస్థకే కాదు.. మొత్తం హైదరాబాద్ నగరానికి గర్వకారణం. ఇవి మా PPP మోడల్ బలాన్ని, స్థిరత్వం పట్ల మా నిబద్ధతను.. అలాగే ఆవిష్కరణలపై మా దృష్టిని మరోసారి నిరూపిస్తున్నాయని ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ MD & CEO కేవీబీ రెడ్డి అన్నారు.
Hyderabad Metro ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా పర్యావరణహిత రవాణా విధానాల ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గడం నగరానికి అదనపు లాభంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించే వినూత్న పద్ధతులు, ఖర్చు తగ్గించే విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ పరిష్కారాలతో మెట్రోను దేశానికి ఆదర్శంగా నిలిపాయి.
ఈ మూడు జాతీయ అవార్డులు హైదరాబాద్ మెట్రోకు కేవలం గౌరవం గానే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు ప్రేరణగా కూడా నిలుస్తాయి. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద మెట్రో విజయవంతం కావచ్చని ఈ ప్రాజెక్ట్ మరోసారి నిరూపించింది. స్థిరత్వం, ఇంధన సామర్థ్యం, ఇంజనీరింగ్ ఆవిష్కరణలను సమ్మిళితం చేస్తూ హైదరాబాద్ మెట్రో భారతదేశం మెట్రో రైలు పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications