ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తిప్పలు: కంపెనీలకు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు!
హైదరాబాద్ (Hyderabad) ఐటీ హబ్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య ముదిరిపోతోంది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఏరియాల్లో పీక్ అవర్స్‌లో రోడ్డు మీదకు రావాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఇప్పుడు ఈ సమస్యపై సైబరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

సమస్య ఎక్కడ వస్తోంది?
రోజుకు దాదాపు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ప్రయాణించే మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, కాపిటాలాండ్ వైపు వెళ్లే రోడ్లన్నీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఊపిరాడకుండా పోతున్నాయి. డెలాయిట్ డ్రైవ్, సైబర్ గేట్‌వే, మైండ్ స్పేస్ రోటరీల దగ్గర ఆఫీస్ క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాలు ఉద్యోగులను పిక్ అప్, డ్రాప్ చేయడానికి రోడ్డు మీదే ఆపేస్తున్నారు. దీనివల్ల వెనుక వచ్చే వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి.
దీనికి తోడు, యాప్ బేస్డ్ క్యాబ్ డ్రైవర్లు రైడ్స్ కోసం రోడ్డు పక్కనే గంటల కొద్దీ వాహనాలు పార్క్ చేసి ఉంచుతున్నారు. నిలోఫర్ కేఫ్ నుంచి ఐకియా (Ikea) దగ్గరున్న ఇండియన్ ఆయిల్ బంక్ వరకు, అలాగే ఐటీసీ కోహినూర్ రోడ్డులో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.
కంపెనీలకే నోటీసులు?
రాయదుర్గం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పవన్ మయాస తెలిపిన వివరాల ప్రకారం.. చాలా ఐటీ కంపెనీల లోపల వాహనాల పార్కింగ్, పిక్ అప్ కోసం బోలెడంత స్థలం ఉంది. కానీ, ఆ లోపలి స్పేస్‌ను సరిగ్గా వాడకుండా వాహనాలను బయట రోడ్ల మీదే ఆపుతున్నారు. అందుకే, పోలీసులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ సర్వే చేస్తున్నారు. ఏ కంపెనీల వల్లైతే బయట ట్రాఫిక్ జామ్ అవుతుందో.. ఆయా ఐటీ సంస్థలకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. తమ ఉద్యోగుల రవాణా వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా కంపెనీలే సొంతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయనున్నారు.
నో పార్కింగ్.. ఫైన్ ఎంతంటే?
ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి స్పెషల్ డ్రైవ్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో రోడ్డు పక్కన ఇష్టమొచ్చినట్టు పార్క్ చేసే వాహనాలను టోయింగ్ (Towing) చేసి తీసుకెళ్తున్నారు. ఇలా తప్పుగా పార్క్ చేసినందుకు ₹1,000 ఫైన్ వేస్తున్నారు. దాంతో పాటు పాత చలాన్లు ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా అక్కడికక్కడే వసూలు చేస్తున్నారు.
పెయిడ్ పార్కింగ్ వస్తోందా?
రోడ్ల మీద వాహనాలు ఆగకుండా ఉండేందుకు క్వాల్కమ్ (Qualcomm) క్యాంపస్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక డెడికేటెడ్ పెయిడ్ పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం TGIIC అధికారులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఇతర బిజినెస్ స్టేక్‌హోల్డర్స్‌తో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఈ ట్రాఫిక్ తలనొప్పులకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఐటీ ఉద్యోగులు ఏం చేయాలి?
ఈ ట్రాఫిక్ గందరగోళానికి చెక్ పెట్టాలంటే కేవలం పోలీసులు, కంపెనీలు మారితే సరిపోదు.. ఐటీ ఉద్యోగులు కూడా తమ వంతు బాధ్యతగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు సొంత వాహనాలు, క్యాబ్‌లపై ఆధారపడటం తగ్గించి, మెట్రో రైల్ లేదా ఆర్టీసీ బస్సుల వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడటం ఉత్తమం.


Click it and Unblock the Notifications