Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్‌మెంట్లు!
గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందింది. 2019 నుంచి 2025 మధ్య కాలంలో నగరంలో ఇళ్ల ధరలు ఏకంగా 81 శాతం పెరిగాయని నోబ్రోకర్ (NoBroker) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో చదరపు అడుగు సగటు ధర ₹8,326కి చేరుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న నగరాల్లో గురుగ్రామ్ (85%) తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ధరలు పెరుగుతున్నా, ఇళ్ల సైజులు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

'ష్రింక్‌ఫ్లేషన్' అంటే ఏమిటి?
సాధారణంగా వస్తువు ధర పెంచి పరిమాణం తగ్గించడాన్ని ష్రింక్‌ఫ్లేషన్ అంటారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు Hyderabad హౌసింగ్ మార్కెట్‌లో కనిపిస్తోంది. 2019లో ఒక అపార్ట్‌మెంట్ సగటు సైజు 1,068 చదరపు అడుగులు ఉండగా అది ఇప్పుడు 1,025 చదరపు అడుగులకు పడిపోయింది. అంటే కస్టమర్లు ఎక్కువ ధర చెల్లిస్తున్నా, తక్కువ స్థలంతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. సుమారు 84 శాతం మంది కొనుగోలుదారులు ఇప్పుడు కోటి రూపాయల లోపు ఇల్లు దొరకడం అసాధ్యమని భావిస్తున్నారు.
విలాసవంతమైన ఇళ్లకే డెవలపర్ల మొగ్గు
మార్కెట్‌లో సాధారణ , మధ్యతరగతి ఇళ్ల సరఫరా తగ్గిపోవడానికి ప్రధాన కారణం డెవలపర్ల వ్యూహం మారడమే. భూమి ధరలు విపరీతంగా పెరగడంతో, బిల్డర్లు ఎక్కువ లాభాలు వచ్చే ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నారు. దీంతో తక్కువ బడ్జెట్ ఉన్న వారికి కొత్త ఇళ్లు దొరకడం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది కొనుగోలుదారులు రీసేల్ (Resale) మార్కెట్ వైపు చూస్తున్నారు. పాత ఇళ్లు తక్కువ ధరలో, విశాలంగా దొరుకుతుండటమే ఇందుకు కారణం.
డిమాండ్ హాట్‌స్పాట్స్ ఇవే!
హైదరాబాద్‌లో వెస్ట్ కారిడార్ ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రారాజుగా కొనసాగుతోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలైన కోకాపేట, తెల్లాపూర్, నార్సింగి, రాజేంద్ర నగర్, నియోపోలిస్ వంటి ప్రాంతాల్లో ఏటా 20 శాతం పైగా వృద్ధి కనిపిస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ హబ్ లు నిండిపోవడంతో, ఈ వెస్ట్రన్ ఎక్స్‌టెన్షన్స్ ఇప్పుడు కొత్త విలాసవంతమైన హబ్‌లుగా మారుతున్నాయి. మరోవైపు దక్షిణ హైదరాబాద్ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కారిడార్) 33 శాతం కొత్త ప్రాజెక్టులతో ఐటీ నిపుణులను ఆకర్షిస్తోంది.
మధ్యతరగతి వారికి సవాలే!
మొత్తంగా చెప్పాలంటే.. మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ , మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల హైదరాబాద్ (Hyderabad) లో ప్రాపర్టీ రేట్లు పెరగడం సహజమే అయినా, ధరల పెరుగుదల వేగం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాలు ఇంకా బడ్జెట్ ఇళ్లకు అడ్రస్ గా ఉన్నప్పటికీ, అక్కడ కూడా ధరల సెగ తగులుతోంది. భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకునే వారు లొకేషన్ కంటే కనెక్టివిటీని చూసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక భారీ పరివర్తన దిశగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications