హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకునేవారికి బిగ్ షాక్.. స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదలతో ధరలు పైకి..
Hyderabad Housing Market: హైదరాబాద్ నివాస స్థిరాస్తి మార్కెట్ ప్రస్తుతం ఇటు విక్రయాలు మందగించడం, అటు నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో ఒక సంక్లిష్టమైన సవాలును ఎదుర్కొంటోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత అర్ధభాగంలో ఇళ్ల అమ్మకాలు గత నాలుగేళ్లలోనే అత్యంత బలహీన స్థాయికి పడిపోగా, ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్లు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
ఐతే ఈ పరిస్థితి విస్తృత స్థాయిలో ఇళ్ల ధరల తగ్గింపునకు దారితీయకపోవడానికి ప్రధాన కారణం స్థిరంగా ఉన్న ఆస్తుల విలువలు, ప్రీమియం గృహాలకు లభిస్తున్న ఆదరణే కారణం అని చెప్పవచ్చు. అదే సమయంలో, ఉక్కు, సిమెంట్, ఇసుక, శానిటరీ ఉత్పత్తుల ధరలు ఆందోళనకరంగా పెరగడంతో డెవలపర్లపై ప్రాజెక్టుల నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోతోంది. ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల ప్రత్యక్ష నిర్మాణ వ్యయాలు 8 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగినట్లు అంచనా వేస్తుండగా.. భవనం రూపకల్పన, సంక్లిష్టత ఆధారంగా చదరపు అడుగుకు 150 రూపాయల నుండి 300 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది.

ప్రత్యేకించి మొత్తం నిర్మాణ వ్యయంలో 12 శాతం నుండి 15 శాతం వరకు వాటా కలిగిన ఉక్కు ధరలు పెరగడం డెవలపర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నారెడ్కో తెలంగాణ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం, టీఎంటీ స్టీల్ ధరలు మెట్రిక్ టన్నుకు గతంలో ఉన్న 52,000 రూపాయల నుంచి ప్రస్తుతం 60,000 నుండి 72,000 రూపాయల శ్రేణికి చేరుకున్నాయి. ఉక్కు ధరలు 10 శాతం పెరిగితే మొత్తం ప్రాజెక్టు వ్యయం 1.5 శాతం నుండి 3 శాతం వరకు పెరుగుతుందని, బేస్‌మెంట్లు, షియర్ వాల్స్ అవసరమయ్యే ఎత్తైన భవనాలపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
దీనికి తోడు సిమెంట్ బస్తా ధర 320 నుండి 470 రూపాయలకు చేరగా.. బిటుమెన్ ధరలు టన్నుకు 52,000 రూపాయల వరకు పెరిగాయి. అలాగే టైల్స్, ఇతర ఫినిషింగ్ సామగ్రి ధరలు కూడా 10 శాతం నుండి 20 శాతం వరకు పుంజుకోవడంతో నిర్మాణ రంగానికి రవాణా, ఇంధన ఖర్చులు సవాలుగా మారాయి. ఈ వ్యయ భారాన్ని డెవలపర్లు ప్రస్తుత కొనుగోలుదారులపై తక్షణమే మోపలేకపోతున్నారు. ముందే ఒప్పందం చేసుకున్న యూనిట్లకు పాత ధరలనే కొనసాగిస్తూ తమ లాభాల మార్జిన్లను తగ్గించుకోవాల్సి వస్తోంది.
అయితే, రాబోయే రోజుల్లో కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులలో లేదా ఇంకా అమ్మకం కాని నిల్వలలో 1 శాతం నుండి 3 శాతం వరకు ధరల పెంపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల బల్క్ కొనుగోలు శక్తి లేని చిన్నతరహా కాంట్రాక్టర్లు, డెవలపర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా ఆగస్టులో సగటు లావాదేవీ ధర చదరపు అడుగుకు 4,964 రూపాయలకు చేరి 8 శాతం పెరుగుదలను నమోదు చేయడం, ముఖ్యంగా కోటి రూపాయలకు పైబడిన ప్రీమియం ఇళ్లకు 54 శాతం లావాదేవీ విలువ దక్కడం మార్కెట్ యొక్క అంతర్గత బలాన్ని సూచిస్తోంది.
పరిశ్రమ వర్గాల ప్రకారం, కొత్త ప్రాజెక్టులు వేగంగా ప్రారంభమవ్వడం వల్ల విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతం పెరిగి 1.42 లక్షల యూనిట్లకు చేరినప్పటికీ, అందులో తక్షణమే నివాసానికి సిద్ధంగా ఉన్నవి కేవలం 30,000 యూనిట్లు మాత్రమే కావడం కొంత ఊరటనిచ్చే అంశం. రాబోయే ఆరు నుండి పన్నెండు నెలల కాలంలో ఉక్కు, సిమెంట్ ధరలు మరికొంత హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున, డెవలపర్లు సరఫరాదారులతో ఫార్వర్డ్ కాంట్రాక్టులు చేసుకుంటూ అటు అమ్మకాల వేగాన్ని, ఇటు నిర్మాణ వ్యయాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


Click it and Unblock the Notifications

