బుల్లెట్ ట్రైన్ రూట్‌లో బిగ్ ట్విస్ట్.. అమరావతి వాసులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే గిఫ్ట్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత వాసులకు ఒక సూపర్ న్యూస్. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ (బుల్లెట్ ట్రైన్) రూట్ మ్యాప్‌పై ఎట్టకేలకు ఒక కీలకమైన క్లారిటీ వచ్చింది. మొదట అనుకున్నట్లుగానే ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏపీ రాజధాని అమరావతి మీదుగానే వెళ్లనుంది. ఈ మేరకు నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
నిజానికి, మొదట ఈ కారిడార్‌ను గుంటూరు జిల్లా రావెలకు సమీపంలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా తిప్పాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావించారు. కానీ, ఆ రూట్‌లో వెళ్తే కారిడార్ అమరావతి, విజయవాడ నగరాలకు చాలా దూరమైపోతుందని, దీనివల్ల ప్రయాణికులకు యాక్సెస్ తగ్గుతుందని NHSRCL అధికారులు గుర్తించారు. దాంతో పాత ప్లాన్ ప్రకారమే అమరావతి గుండానే ఈ ట్రాక్ నిర్మించాలని డిసైడ్ చేశారు.

మూడు రాష్ట్రాలు.. 18 స్టేషన్లు!
ఈ హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల పొడవున నిర్మితం కానుంది. ఈ రూట్ పొడవునా మొత్తం 18 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో 180.32 కిలోమీటర్ల మేర ఈ రూట్ సాగుతుంది. ఇందులో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి స్టేషన్లు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ పరిధిలో అత్యధికంగా 518.54 కిలోమీటర్ల కారిడార్ రాబోతోంది. ఏపీలో దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి స్టేషన్లు ఉంటాయి. ఇక తమిళనాడులో 61.23 కిలోమీటర్ల పరిధిలో తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్/మింజూర్, చెన్నై సెంట్రల్ స్టేషన్లు వస్తాయి.
అడవుల్లో సొరంగాలు.. తిరుపతి టు చిత్తూరు లింక్!
ఈ ప్రాజెక్టులో ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. చిత్తూరులోని కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం గుండా ఈ ట్రాక్ వెళ్తున్నందున, అడవికి ఎలాంటి నష్టం కలగకుండా పలమనేరు సమీపంలో 11.8 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని (Tunnel) నిర్మించనున్నారు.
మరోవైపు, చెన్నై-బెంగళూరు కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్తుండగా.. హైదరాబాద్-చెన్నై కారిడార్ తిరుపతి ఎయిర్‌పోర్ట్ మీదుగా వెళ్తుంది. ఈ రెండు కారిడార్లను కలుపుతూ తిరుపతి-చిత్తూరు మధ్య ఒక కనెక్టింగ్ హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే బాగుంటుందని చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకు అధికారులు ఇప్పుడు డీపీఆర్ (DPR) సిద్ధం చేస్తున్నారు.
బెంగళూరు రూట్ కూడా రెడీ!
ఇవే కాకుండా హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ పనులు కూడా లైన్లోకి వస్తున్నాయి. మూడు రాష్ట్రాల మీదుగా సాగే ఈ రూట్ మొత్తం 597 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 239 కిమీ, ఏపీలో 264 కిమీ, కర్ణాటకలో 94 కిమీ ట్రాక్ ఉంటుంది. కర్నూలు, అనంతపురం, హిందూపూర్ సహా మొత్తం 15 స్టేషన్లు ఈ రూట్లో రాబోతున్నాయి. మొత్తానికి ఈ హైస్పీడ్ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణం ఎంతో ఈజీ అయిపోనుంది.


Click it and Unblock the Notifications