బెంగళూరును క్రాస్ చేసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. లగ్జరీ హౌమ్స్ అమ్మకాల్లో తిరుగులేని విజేతగా..
దక్షిణ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ, సిఆర్ఇ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ 'అల్ట్రా-లగ్జరీ' గృహాల అమ్మకాల్లో తిరుగులేని విజేతగా నిలిచింది. పది కోట్ల రూపాయలకు పైగా విలువైన గృహాల విక్రయాల్లో హైదరాబాద్ ఏకంగా రూ. 8,562 కోట్ల మార్కును అందుకుని, పొరుగున ఉన్న ఐటీ హబ్ బెంగళూరును భారీ తేడాతో వెనక్కి నెట్టింది.
హైదరాబాద్ సాధించిన ఈ ఘనత వెనుక ఉన్న ప్రధాన రహస్యం 'స్పేస్ ఆర్బిట్రేజ్'. అంటే, ఒకే ధరకు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువ స్థలం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ రూ. 10 కోట్లు వెచ్చిస్తే హైదరాబాద్‌లో సుమారు 6,210 చదరపు అడుగుల విశాలమైన ఇల్లు లభిస్తుంది. అదే మొత్తానికి బెంగళూరులో కేవలం 3,930 చదరపు అడుగులు, చెన్నైలో 4,290 చదరపు అడుగుల స్థలం మాత్రమే దక్కుతుంది. ఈ పరిమాణమే సంపన్న కొనుగోలుదారులను, ముఖ్యంగా ఫార్మా ఎగ్జిక్యూటివ్‌లు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎన్నారైలను ఆకర్షిస్తోంది.

నగరంలోని కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలు ఈ విలాసవంతమైన మార్పుకు కేంద్రబిందువులుగా మారాయి. ఇక్కడ కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ, భూమి కొరత వంటి సమస్యలు అల్ట్రా-లగ్జరీ మార్కెట్‌ను పరిమితం చేస్తుండగా, హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధమైన పట్టణ విస్తరణ, మెరుగైన రహదారి నెట్‌వర్క్ డెవలపర్లకు వరంగా మారాయి.
నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో జరిగిన అత్యంత ఖరీదైన అమ్మకాల్లో సగానికి పైగా (57%) 8,000 చదరపు అడుగుల కంటే పెద్దవి కావడం విశేషం. విల్లాలు, రో హౌస్‌లు మొత్తం లావాదేవీల విలువలో 40% వాటాను ఆక్రమించాయి. బెంగళూరులో యూనిట్ అమ్మకాలు 52% పెరిగినప్పటికీ, విలువల పరంగా మాత్రం హైదరాబాద్ దానికంటే నాలుగు రెట్లు ముందుంది. చెన్నై నగరం తన వారసత్వ విలువలకే పరిమితం కాగా, హైదరాబాద్ మాత్రం 'లగ్జరీ ఎకోసిస్టమ్'ను నిర్మించడంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.
అయితే, ఈ రెండు నగరాల మధ్య పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరులో అమ్ముడుపోని ఇళ్లు తక్కువగా ఉండటం వల్ల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో ఇన్వెంటరీ (అందుబాటులో ఉన్న ఇళ్లు) ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులకు బేరసారాలు ఆడే అవకాశం లభిస్తుంది. ఏది ఏమైనా, దక్షిణ భారతదేశంలో విలాసవంతమైన జీవనశైలికి హైదరాబాద్ ఇప్పుడు ఒక చిరునామాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications
