Premier Energies IPO: మార్చి నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఐపీవోల రాక నెమ్మదించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే సోలార్ రంగానికి చెందిన కంపెనీ నుంచి ఐపీవో ప్రకటించబడింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ప్రీమియర్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఐపీవో గురించే. ఇది సోలార్ సెల్ తయారీ సంస్థ. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీవో కింద రూ.1,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది. ఇది కాకుండా ప్రమోటర్లు, పెట్టుబడిదారుల నుంచి 2.82 కోట్ల షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. ఈ కంపెనీ IPO కంటే ముందు పెద్ద పెట్టుబడిదారులకు రూ.300 కోట్ల విలువైన షేర్లను జారీ చేయగలదు. ఇది జరిగితే ఐపీవో ఆఫర్ పరిమాణం తగ్గుతుంది.

కంపెనీ తన షేర్లను బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది. ఐపీవో ద్వారా వచ్చే ఆదాయం అనుబంధ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(PEGEPL)లో పెట్టుబడి పెట్టడానికి కంపెనీ వినియోగించనుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో 4GW సోలార్ PV టాప్‌కాన్ సెల్, 4GW సోలార్ PV టాప్‌కాన్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఐపీవో నుంచి సేకరించిన డబ్బును ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.5,300 కోట్లు విలువైన ఆర్డర్ బుక్ ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2023 వరకు కంపెనీ ఆదాయం రూ.2,017 కోట్లుగా నమోదైంది.
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కస్టమర్లలో టాటా కంపెనీ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ కూడా ఉంది. ఇది కాకుండా NTPC, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాంటినమ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, శక్తి పంప్స్ లిమిటెడ్, ఫస్ట్ ఎనర్జీ 6 ప్రైవేట్ లిమిటెడ్, లుమినస్ పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హార్టేక్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ ఇన్‌ఫ్రా విండ్ ఎనర్జీ లిమిటెడ్ కూడా కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్‌లో ఐదు తయారీ సౌకర్యాలు ఉన్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 1995లో ఛైర్మన్ & హోల్ టైమ్ డైరెక్టర్ అయిన సురేంద్ర పాల్ సింగ్ సలుజా దీనిని స్థాపించారు.


Click it and Unblock the Notifications