Megha Engineering: మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు అందరి చూపులు ఎలక్టోరల్ బాండ్ల డేటాపై పడింది. ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం అయ్యాయి.
రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన జాబితాలో బడా కంపెనీల పేర్లు వినిపించాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ సంస్థ మెుత్తంగా రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. కంపెనీ ముంబైలోని బికెసిలో జోజిలా టన్నెల్, బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణంతో సహా అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది.

వాస్తవానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ముంబైలో రూ.14,400 కోట్ల టన్నెల్ ప్రాజెక్ట్‌ను పొందటానికి ఒక నెల ముందు అంటే ఏప్రిల్ 2023లో మేఘా కంపెనీ రూ.140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త పెద్ద అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కంపెనీ జమ్మూ కాశ్మీర్‌లో రూ.4,500 కోట్ల టన్నెల్ ప్రాజెక్ట్, ముంబైలో రూ.3,681 కోట్లతో బుల్లెట్ రైలు స్టేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,358 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ వంటి భారీ మౌలికవసతుల నిర్మాణ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ కేంద్రంగా దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న మేఘా సంస్థ ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తర్వాత తెలంగాణలో కేసీఆర్ సారధ్యంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ కోసం రూ.195 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ముఖ్యంగా కంపెనీ కేంద్రంతో పాటు అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బాండ్ల కొనుగోలు ద్వారా భారీ మెుత్తాన్ని పార్టీ ఫండ్ రూపంలో అందించటం ఇప్పుడు చర్చకు దారితీసింది.
MEIL ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు విధానం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఒప్పందాలకు బిడ్డింగ్ చేయటంతో పాటు వాటిని దక్కించుకోవటానికి ముందు వ్యూహాత్మకంగా జరిగినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది. ముంబై పౌర సంఘం నుంచి సంబంధం లేని రూ.1,800 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో జాప్యం చేసినందుకు జరిమానా విధింపబడిన తర్వాత కూడా వివిధ పౌర సంస్థలతో కలిపి పనిచేస్తూనే ఉంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు విరాళాలను అందిస్తూ తన వ్యాపారాన్ని సజావుగా జరిపించుకుంటోంది. తాజాగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారం పూర్తిగా ప్రజలకు తెలియాలని కోర్టు ఆదేశించటంతో విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications