Hyderabad News: ఆతిథ్య రంగంలో హైదరాబాద్ సంచలనం.. బెంగళూరు, ఢిల్లీలను వెనక్కునెట్టి మరీ..
Oyo: హాస్పిటాలిటీ రంగంలో ఓయో సంచలనం సృష్టిస్తోంది. చిన్న పట్టణాల మొదలు మెట్రో నగరాల వరకు విస్తరిస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతోంది. తాజాగా 2023కి సంబంధించిన బుకింగ్ డేటాను రిలీజ్ చేసింది. ఇందులో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.
ట్రావెలోపీడియా 2023 పేరిట ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫారమ్ ఓయో ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో అత్యధికంగా బుక్ చేయబడిన నగరంగా హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. తరువాతి స్థానాన్ని బెంగుళూరు ఆక్రమించింది. కాగా ఈ ఏడాది అత్యధికంగా సందర్శించబడిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ కొనసాగుతుండగా.. మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంతో వెన్నంటే ఉంది.

ఇయర్-ఎండ్ వార్షిక ట్రావెల్ ట్రెండ్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. అన్ని లాంగ్ వీకెండ్‌లలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 మధ్య అత్యధిక బుకింగ్‌లను నమోదు చేసినట్లు ఓయో ఓ ప్రకటనలో తెలిపింది. "గతేడాదితో పోలిస్తే గోరఖ్‌పూర్, దిఘా, వరంగల్ మరియు గుంటూరు వంటి చిన్న పట్టణాలు అత్యధిక వృద్ధిని సాధించాయి" అని వెల్లడించింది.
విశ్రాంతి గమ్యస్థానాలలో 2023కి గాను జైపూర్ అత్యధికంగా సందర్శించిన నగరంగా ముందంజలో ఉందని పేర్కొంది. గోవా, మైసూర్ మరియు పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. ఇక అత్యధికంగా బుక్ చేయబడిన ఆధ్యాత్మిక మరియు తీర్థయాత్రల గమ్యస్థానంగా పూరీ అగ్రస్థానాన్ని పొందినట్లు చెప్పింది. అమృతసర్, వారణాసి మరియు హరిద్వార్ లు తదనంతర స్థానాల్లో కొనసాగుతున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రాల పరంగా చూస్తే ఈ ఏడాది అత్యధిక బుకింగ్స్ సాధించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఓయో స్పష్టం చేసింది. ట్రావెల్ ఇండస్ట్రీకి 2023 విలక్షణమైన ఏడాదిగా నిలిచిందని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే తెలిపారు. కొవిడ్ ద్వారా ఎదురైన సవాళ్లు పూర్తి సాధారణ స్థితికి వస్తున్నాయని భావిస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications