ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లినప్పుడు ఆదుకునేందుకు బీమా పాలసీలను తీసుకుంటారు. ఈ రోజుల్లో వీటి అవసరం బాగా పెరిగిపోతోంది. వ్యక్తులే కాదు కంపెనీలు కూడా ఇప్పుడు భారీ స్థాయిలో బీమా పాలసీలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు రకాల చర్యలు, తీసుకువస్తున్న కొత్త చట్టాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు తమ డైరెక్టర్లు, ఆఫీసర్ల కోసం బీమా పాలసీలు తీసుకుంటున్నారు. ఇలాంటి పాలసీలకు డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం.

ఎందుకు డిమాండ్ పెరుగుతోందంటే?
* కార్పొరేట్ మోసాలు భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు వాటి డైరెక్టర్లు, ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మవాళా సంబంధిత ఇబ్బందులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే డైరెక్టర్లు, అధికారులకు ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే డైరెక్టర్, ఆఫీసర్ పాలసీల్లో వార్షికంగా 20-30 శాతం వృద్ధి నమోదు అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

దివాళా.. బ్యాంక్రప్టసీ
* దివాళా, బ్యాంక్రప్టసీ కోడ్, వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ప్రజావేగు రక్షణ చట్టం తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న చట్టాల అమలును పటిష్టవంతం చేయడం, అమలులో వేగవంతం చేయడంతో పాటు నిర్వహణ పరమైన రిస్కులు పెరిగిపోవడం వల్ల వీటి నుంచి రక్షణ కలిగేందుకు బీమా పాలసీలు తీసుకోవడం పెరిగిపోతోంది.
* మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రస్థాయిలో ఉన్న500 కంపెనీలు సరిపోయేంత స్థాయిలో డైరెక్టర్, ఆఫీసర్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ డైరెక్టర్లకు బీమా తీసుకుంటున్నారు.
* ఈ కంపెనీలకు డైరెక్టర్, ఆఫీసర్ బీమా పాలసీ ని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తప్పని సరి చేసింది.

మోసం జరిగితే...
* కంపెనీల్లో మోసాలు జరిగిన సందర్భంలో కంపెనీ యాజమాన్యంతోపాటు కంపెనీ డైరెక్టర్లపైనా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో క్లాస్ యాక్షన్ సూట్ వేయడానికి కంపెనీల చట్టం అనుమతిస్తుంది.
* ఇలాంటి సందర్భంలో డైరెక్టర్, ఆఫీసర్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతోంది. నిర్వహణ పరమైన తప్పులు, మోసాలు జరిగినప్పుడు ఆర్థిక పరంగా ఎదురయ్యే నష్టాలను ఎదుర్కోవడానికి ఈ పాలసీ దోహదపడుతుంది.
* పాలసీ తీసుకున్న సందర్భంలో కేసు దర్యాప్తు వ్యయాల నుంచి రెగ్యులేటరీ సంస్థల ముందు హాజరు కావడానికి అయ్యే వ్యయాల వరకు బీమా రక్షణ లభిస్తుంది.
* నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ప్రత్యేక రక్షణ, రిటైర్ ఎగ్జిక్యూటివ్ లకు జీవిత కాలం కవరేజి లభిస్తుంది.


Click it and Unblock the Notifications