ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపం వేగంగా మారిపోతోంది. గతంలో లాగా ఒకే కంపెనీలో చేరి, అక్కడే ఏళ్ల తరబడి పనిచేస్తూ ప్రమోషన్లు పొందడం (Linear Career) అనేది ఇప్పుడు పాత పద్ధతి అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో 'జిగ్‌జాగ్' (Zigzag) కెరీర్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏఐ జాబ్స్ (AI Jobs) ను భర్తీ చేస్తున్న తరుణంలో, ఒకే రంగంలో నిపుణుడిగా ఉండటం కంటే.. రకరకాల రంగాల్లో నైపుణ్యం సంపాదించడం ఇప్పుడు అవసరంగా మారింది.

అసలేమిటీ 'జిగ్‌జాగ్' కెరీర్?
సరళంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన కెరీర్ ప్రయాణంలో విభిన్నమైన పాత్రలను పోషించడం. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేవలం కోడింగ్‌కే పరిమితం కాకుండా.. కంటెంట్ రైటర్‌గా, స్ట్రాటజిస్ట్‌గా లేదా యూట్యూబ్ క్రియేటర్‌గా మారడం. అంటే, ఒకే దారిలో కాకుండా అడ్డదిడ్డంగా (Zigzag) ప్రయాణిస్తూ రకరకాల స్కిల్స్ నేర్చుకోవడం. దీనివల్ల ఏ ఒక్క రంగంలో AI ప్రభావం పడినా, మరో రంగంలో ఉన్న నైపుణ్యం మనల్ని కాపాడుతుంది.
AI సృష్టిస్తున్న విధ్వంసం
రాండ్‌స్టాడ్ ఎంటర్‌ప్రైజ్ నివేదిక ప్రకారం, 2024 జనవరి నుండి ప్రపంచవ్యాప్తంగా 29 శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను AI మింగేసింది. కేవలం జూనియర్ లెవల్ మాత్రమే కాదు, మిడిల్ మేనేజ్‌మెంట్‌లో కూడా 50 శాతం పోస్టులను AI ద్వారా తగ్గించాలని 20 శాతం కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నివేదిక ప్రకారం, 2030 నాటికి 39 శాతం ప్రధాన ఉద్యోగ నైపుణ్యాలు మారిపోతాయి. డెల్ టెక్నాలజీస్ అయితే మరో అడుగు ముందుకు వేసి.. మరో ఐదేళ్లలో ఉండబోయే ఉద్యోగాల్లో 85 శాతం ఇప్పుడు అసలు ఉనికిలోనే లేవని పేర్కొంది.
ఇండియన్ గిగ్ ఎకానమీ , యువత మార్పు
భారతదేశంలో 'గిగ్ ఎకానమీ' (Gig Economy) ఏటా 21 శాతం వృద్ధి చెందుతోంది. యువత ఇప్పుడు కేవలం ఒకే ఫుల్ టైమ్ ఉద్యోగాన్ని నమ్ముకోవడం లేదు. ఫ్రీలాన్సింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుండగా, యువతకు తమ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసే వెసులుబాటు కలుగుతోంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం, 2025లో ప్రాజెక్ట్ బేస్డ్ హైరింగ్ 38 శాతం పెరిగింది.
మొత్తంగా చెప్పాలంటే, 'జిగ్‌జాగ్' కెరీర్‌లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అదే మనకు రక్షణ కవచం. ఒక్క రంగంలోనే మాస్టర్ అవ్వడం కంటే, అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉన్న 'జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్' (Jack of all trades) గా ఉండటమే ఏఐ జాబ్స్ (AI Jobs) యుగంలో అసలైన తెలివితేటలు. భవిష్యత్తులో స్థిరత్వం కంటే మనకున్న బహుముఖ నైపుణ్యాలే (Versatility) మనకు జీవనోపాధిని చూపిస్తాయి.


Click it and Unblock the Notifications