USD to INR: డాలర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? డాలర్ ఆధిపత్యం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
నేడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా మరో దేశంతో వ్యాపారం చేయాలంటే మొదట గుర్తుకు వచ్చేది అమెరికన్ డాలరే. అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ వాటా డాలర్ల రూపంలోనే జరుగుతుంది. మరి అసలు ఈ డాలర్ ప్రపంచ కరెన్సీగా (Reserve Currency) ఎలా ఎదిగింది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటిష్ పౌండ్ నుండి డాలర్ వైపు..
ఒకప్పుడు ప్రపంచాన్ని బ్రిటన్ పాలించేది. కాబట్టి 'బ్రిటిష్ పౌండ్' ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేది. కానీ.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఆర్థికంగా చితికిపోయింది. అదే సమయంలో అమెరికా పారిశ్రామికంగా ఎదిగి, ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా అవతరించింది. 1944 లో జరిగిన 'బ్రెట్టన్ వుడ్స్' ఒప్పందం డాలర్ దశను మార్చేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ దేశాలన్నీ తమ కరెన్సీలను డాలర్ తో అనుసంధానించాయి. అమెరికా తన డాలర్ ను బంగారంతో అనుసంధానించింది. అంటే డాలర్ ఇస్తే బంగారం ఇస్తామన్న హామీతో ఇది మొదలైంది.
బంగారం లేకపోయినా తగ్గని జోరు!
1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. డాలర్ కు బదులుగా బంగారం ఇచ్చే పద్ధతిని నిలిపివేశారు (దీనినే నిక్సన్ షాక్ అంటారు). అప్పటి నుండి డాలర్ 'ఫియట్ కరెన్సీ' గా మారింది. అంటే దీనికి వెనుక బంగారం లాంటి ఆస్తి ఏదీ ఉండదు. కేవలం అమెరికా ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే దీని విలువ. అయినప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, ఆ దేశ స్టాక్ మార్కెట్లు పారదర్శకంగా ఉండటంతో ప్రపంచం మొత్తం డాలర్‌నే నమ్ముతూ వచ్చింది.
డాలర్ ఆధిపత్యం వల్ల అమెరికాకు కలిగే లాభాలేంటి?
దీనిని ఆర్థికవేత్తలు 'ఎక్సోర్బిటెంట్ ప్రివిలేజ్' (అసాధారణమైన అధికారం) అని పిలుస్తారు.
- తక్కువ వడ్డీకి అప్పులు: ప్రపంచమంతా డాలర్ల కోసం వెతుకుతుంటుంది. కాబట్టి అమెరికా చాలా తక్కువ వడ్డీకే ఇతర దేశాల నుండి అప్పులు తీసుకోగలదు.
- వ్యాపార లోటు: అమెరికా ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేసినా.. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో పడదు. ఎందుకంటే మిగిలిన దేశాలు డాలర్లను నిల్వ ఉంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
- ఆంక్షల పవర్: ఏదైనా దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలంటే అమెరికాకు డాలర్ ఒక ఆయుధంగా మారుతుంది.
డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదా?
ప్రస్తుతం చైనా తన 'యువాన్' కరెన్సీని, రష్యా ఇతర కరెన్సీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. డాలర్‌ను ఢీకొట్టడం అంత సులభం కాదు. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో దాదాపు 59% ఇప్పటికీ డాలర్లే ఉన్నాయి. అలాగే చమురు (Oil) వంటి ముడి సరుకుల ధరలు డాలర్లలోనే నిర్ణయించబడతాయి. ఒక కరెన్సీ స్థానాన్ని ఇంకో కరెన్సీ భర్తీ చేయాలంటే దశాబ్దాల కాలం పడుతుంది.
అయితే డాలర్ బలంగా ఉండటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. డాలర్ విలువ పెరిగినప్పుడల్లా భారత్ లాంటి దేశాల్లో దిగుమతులు ప్రియమవుతాయి, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. USD to INR ఎక్స్ఛేంజ్ రేటులో వచ్చే మార్పులు మన దైనందిన జీవితంపై, ముఖ్యంగా సామాన్యుల జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అమెరికా తన ఆర్థిక క్రమశిక్షణను కోల్పోతే తప్ప సమీప భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యం తగ్గే సూచనలు కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications